Driver Heart Attack: బస్సు డ్రైవింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు( Heart stroke) వచ్చింది. అప్పటికే బస్సులో ప్రయాణికులు ఉన్నారు అపస్మారక స్థితికి చేరుకున్న ఆ డ్రైవర్ స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయారు. అంతటి అపస్మారక స్థితిలో సైతం రోడ్డు పక్కన ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బస్సును నిలిపివేశారు. తరువాత ప్రాణాలు వదిలారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని మదనపల్లె రోడ్డులో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కావలి పట్టణంలోని తుఫాన్ నగర్ కు చెందిన రసూల్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కావలి నుంచి రాయచోటి మీదుగా బెంగుళూరు వెళుతుండగా గుండెపోటుకు గురయ్యారు.
మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థత..
కావలి డిపోలో( Kavali depo ) పనిచేస్తున్న రసూల్ శుక్రవారం విధులకు హాజరయ్యారు. సూపర్ లగ్జరీ బస్సును రాయచోటి మీదుగా బెంగుళూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గుండెనొప్పి వచ్చింది. అయితే అప్పటికే బస్సులో ప్రయాణికులు ఉన్నారు. వేకువ జాము సమయం కావడంతో రహదారిపై రద్దీ లేదు. అయితే గుండెపోటు రావడంతో వెంటనే అప్రమత్తమైన రసూల్ బస్సును రోడ్డు పక్కకు తిప్పారు. దీంతో ఓ షాపు ఎదుట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది బస్సు. అలానే స్టీరింగ్ పై కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రసూల్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: విశాఖ, విజయవాడ మెట్రో..ఏ రూట్స్ లో ఏ స్టేషన్ ఉంది?
చాకచక్యంగా వ్యవహరించి..
అయితే రసూల్( Rasul ) చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. తనకు గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంటున్న క్రమంలో బస్సును రోడ్డు పక్కకు తిప్పి సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేశాడు. వేకువ జామున కాబట్టి ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. అదే పట్టపగలు జరిగి ఉంటే మాత్రం చాలా ప్రమాదం జరిగేది. అయితే ఒక్కసారిగా రసూల్ అప్రమత్తమై బస్సును పక్కకు తిప్పి ప్రాణాలు వదలడం పై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చనిపోయి తమ బతుకులు నిలబెట్టాడని చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనతో కావలి పట్టణంలో విషాదం అలుముకుంది. ఆర్టీసీ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.