Fengal Cyclone : తుఫాను బలహీనపడినా ఏపీలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండగా పడుతున్న ఈ వర్షాలతో అపార నష్టం కలుగుతుంది. ప్రధానంగా చిత్తూరు తో పాటు నెల్లూరు జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పరిస్థితి విషమంగా ఉండడంతో అన్ని పాఠశాలలు,కాలేజీలకుసెలవు ప్రకటించారు. ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత క్రమేపి బలహీన పడింది. దీని ప్రభావంతో తిరుపతి చిత్తూరు అన్నమయ్య నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు అపార నష్టం కలిగింది. అదే సమయంలో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాలో సైతం ముసురు వాతావరణం నెలకొంది. సోమవారం కోస్తావ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
* తిరుపతిలో అత్యధికం
తిరుపతి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయింది. పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాచపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పాడులో 149.25, తడ మండలం భీములవారిపాలెంలో 137, చిట్టమూరు మండలం మల్లాంలో 134.5, దొరవారిసత్రం మండలం పూల తోటలో 124, నగిరి లో 120.75, సూళ్లూరుపేట లో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
* పంటలకు అపార నష్టం
భారీ వర్షాల నేపథ్యంలో పంటలకు అపార నష్టం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలిక పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమలలో వర్షంతో పాటు చలి బాగా పెరగడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. దట్టమైన పొగ మంచు తిరుమలను కప్పేసింది. తిరుమల కొండపై ఉన్న ఐదు డ్యాములు పూర్తిగా నీటితో నిండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో వర్ష ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.