Roja: రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం నడుస్తోంది. తిధి, నక్షత్రం చూసుకుని అభ్యర్థులు శుభముహూర్తాన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. తమ అఫీడవిట్లలో ఆస్తులు, బ్యాంకు ఖాతా వివరాలు, ఈతర డిపాజిట్లు కేసుల వివరాలు స్పష్టంగా పొందుపరచాలి. లేకుంటే తరువాత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి.అయితే చాలామంది నేతల చూస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.మంత్రి రోజా అఫిడవిట్ చూస్తే సీఎం జగన్ కైనా షాక్ తగలక మానదు.
ప్రస్తుతం వైసీపీకి చంద్రబాబుతో పాటు రామోజీరావు కూడా ప్రధాన శత్రువు. దుష్ట చతుష్టయంలో రామోజీరావు ఒకరని జగన్ తరచూ చెబుతుంటారు. మార్గదర్శి విషయంలో రామోజీరావు చుట్టూ ఉచ్చు బిగించారు. ఆయన సంస్థలపై దాడులు చేయించడం.. కేసులు పెట్టించడం అందరికీ తెలిసిన విషయమే. ఇక వైసిపి నేతలు రామోజీరావు అంటేనే అంత ఎత్తుకు ఎగిరి పడుతుంటారు. గత ఐదు సంవత్సరాలుగా మార్గదర్శి విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అయితే అదే సంస్థలో కీలక మంత్రిగా ఉన్న రోజాకు ఖాతా ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తన పేరుతో 40 లక్షల రూపాయల విలువైన చీటీ ఉందని రోజా తన అఫీడవిట్లో పేర్కొనడం విశేషం.
మార్గదర్శిపై కేసు ఈనాటిది కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. దానిని జగన్ అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఆ సంస్థలో రోజా చీటీ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2020 నుంచి తాను చీటీ కడుతున్నట్లు.. దాని విలువ 40 లక్షల రూపాయలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మార్గదర్శి తప్పుడు సంస్థ అని స్వయంగా వైసిపి మంత్రులే చెప్పారు. అటువంటి సంస్థలోనే సహచర మంత్రి చీటీ కట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముంగిట ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతోంది. మరి దీనిని వైసీపీ శ్రేణులు ఎలా సమర్థించుకుంటాయో చూడాలి.