RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ రెచ్చిపోయాడు. ఆదివారం నాటి కొత్త పలుకులో చెలరేగిపోయాడు. అక్షర విన్యాసంతో.. తనకు మాత్రమే సాధ్యమైన ఆగ్రహంతో తాండవం చేశాడు. కెసిఆర్ పై విమర్శలు.. జగన్ మీద ఆరోపణలు.. మొత్తంగా తన కొత్త పలుకును యుద్ధ క్షేత్రాన్ని చేశాడు. జగన్ మీద, కెసిఆర్ మీద రాధాకృష్ణకు ఈ స్థాయిలో కోపం ఊహించిందే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో ఎన్నడూ రెచ్చిపోలేదు.
ఇటీవల కాలంలో ఏపీలో జగన్.. తెలంగాణలో కెసిఆర్ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న నేపథ్యంలో పార్టీలకు పూర్వ వైభవం తీసుకురావడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాల ద్వారా.. తమ మీడియా వ్యవస్థల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో నెగిటివ్ ప్రచారమే అధికంగా ఉంది.
జగన్, కెసిఆర్ కు అధికారం కావాలి. అలాంటప్పుడు అధికారాన్ని దక్కించుకోవడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే గిట్టని వారి మీద నాలుగు దోసిల్ల మన్ను పోస్తారు. ఇంకా చెప్పాలంటే అడ్డగోలు ప్రచారం కూడా చేస్తారు. దాన్ని రాజకీయ వ్యూహం అని కూడా ప్రచారం చేసుకుంటారు.. ఇందులో తప్పులేదు. తప్పు పట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నేటి కాలంలో రాజకీయాలు అలా తగలబడ్డాయి కాబట్టి.. పైగా సోషల్ మీడియా అనేది రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత మరింత వికృతంగా మారిపోయాయి.
ఏ రాజకీయ నాయకుడైనా సరే తనకంటూ ఒక సెంటిమెంట్ సృష్టించుకుంటాడు. కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో రెండుసార్లు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత అధికార యావ పెరిగిపోయి దేశంలో చక్రాలు తిప్పాలి అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చాయి.. దీంతో కెసిఆర్ కు వాస్తవమేమిటో తెలిసింది. అంతే.. ఆ తర్వాత తనకు అచ్చి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ మరోసారి రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు.. జగన్ కూడా అంతే.. తనకు పేటెంట్ రైట్ లాగా ఉన్న పాదయాత్రను మరోసారి చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
అధికారాన్ని దక్కించుకోవాలి కాబట్టి జగన్, కెసిఆర్ ఏదైనా చేయాలి. అది వారి అనివార్యత. దానిని రాధాకృష్ణ తప్పుపట్టాడు. తెలంగాణ సెంటిమెంట్ కెసిఆర్ సొత్తా అంటూ విమర్శించాడు. వాస్తవానికి ఇదే రాధాకృష్ణ అనేక పర్యాయాలలో తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని రాశారు. అలాంటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కెసిఆర్ కు మాత్రమే సొంతమవుతుంది కదా? ఇక్కడ ఏదో కేసీఆర్ ను మేము వెనకేసుకు రావడం లేదు. కాకపోతే తను రాసిన రాతల మీదనే నిలపడకపోతే రాధాకృష్ణ నిజాయితీ ఏముంటుంది? ఆయనకు ప్రశ్నించే అధికారం ఎక్కడ ఉంటుంది? రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదే రాధాకృష్ణ విపరీతమైన కవరేజ్ ఇచ్చాడు కదా.. నాడు చంద్రబాబు లోపాలను కూడా బయట పెట్టాడు కదా.. జగన్ చేసిన పాదయాత్ర వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా.. అలాంటప్పుడు జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తే తప్పేముంది? చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసింది నిజం కాదా? వారిద్దరూ పాదయాత్ర చేస్తున్నప్పుడు రాధాకృష్ణ ఏ విధంగా రాశారు?
ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా జనాలలో మెదులుతూనే ఉంటాయి. వాటికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాధాకృష్ణ మీద ఉంటుంది. ఎందుకంటే రాధాకృష్ణ ఒక జర్నలిస్ట్.. అంతకుమించి ఒక పత్రిక అధిపతి. సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వ్యక్తి. కానీ తనకు నచ్చిన వ్యక్తుల మీద ఒకరకంగా.. నచ్చని వ్యక్తుల మీద మరొక రకంగా రాయడం.. వాటికి రకరకాల వక్రీకరణలు అద్దడం నిజంగా పాత్రికేయమనిపించుకోదు. దానికి ఏదైనా కొత్త పదం సృష్టించాలి. ఆ బాధ్యత వేమూరి రాధాకృష్ణ తీసుకోవాలి.