Rising Tides in AP: బంగాళాఖాతంలో( Bay of Bengal ) గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం లో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో అమావాస్య, పౌర్ణమి కి ముందు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చేది. కానీ ఇప్పుడు పర్వదినాలతో సంబంధం లేకుండా గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు వచ్చింది సముద్రం. దీంతో గ్రామస్తులతో పాటు అక్కడికి వచ్చే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తున్నారు. దేవుడికి ఆగ్రహం మూలంగానే ఇలా జరుగుతోందని అనుమానిస్తున్నారు.
మునిగిపోయిన తీరం.. అంతర్వేది( antarvedi ) వద్ద సముద్రం ముందుకు రావడంతో తీరమంతా మునిగిపోయింది. ఎటువైపు చూసినా నీరే కనిపిస్తోంది. సముద్రం ఒడ్డున నిర్మించిన నిర్మాణాలు పూర్తిగా కూలిపోయాయి. అలల తాకిడికి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి సముద్రం ఇలా ముందుకు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇదంతా దేవుడు మహత్యం గా కూడా చెప్పుకొస్తున్నారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం వంటి కారణాలతో సముద్రుడు ఆగ్రహించి ముందుకొస్తున్నారని భక్తులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
Also Read: Titanic in AP: ఏపీ తీరంలో మరో టైటానిక్.. వందేళ్లుగా సముద్ర గర్భంలోనే..
ఉప్పాడ తీరంలో వెనక్కి
అయితే అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారి.. ఉప్పాడ( Uppada) తీరంలో సముద్ర జలాలు వెనక్కి వెళ్లిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్వేది నుంచి ఉప్పాడ కు 128 కిలోమీటర్ల దూరం ఉంది. నిత్యం అంతర్వేదిలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. గోదావరి నది సముద్రంలో కలిసిన చోట స్నానాలు చేస్తుంటారు. అయితే అక్కడ ఇప్పుడు సముద్రం ముందుకు చొచ్చుకొస్తుండడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. సముద్ర స్నానాలు చేయడానికి భక్తులు భయపడిపోయేటంత పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం వల్లే జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. అయితే వాతావరణ సమతుల్యత, ఆమ్లీకరణ, సముద్రంలో కాలుష్యం పెరగడం, తీరంలో మడ అడవులు నరికి వేయడం వంటి కారణాలతోనే.. సముద్రం ముందుకు వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతర్వేదిలో సముద్రం ముందుకు వచ్చిందన్న వార్త మాత్రం ప్రజల్లో ఆందోళన నింపుతోంది.