https://oktelugu.com/

AP Capital: ఏపీ రాజధానిని తేల్చేయనున్న ఫలితాలు

పోలింగ్ ముగిసింది. మరో రెండు వారాల వ్యవధిలో కౌంటింగ్ జరగనుంది. జగన్ గెలిస్తే విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 21, 2024 / 04:59 PM IST

    Results to be decided in AP Capital

    Follow us on

    AP Capital: ఏపీకి ఎన్నికలు ప్రత్యేకం. సాధారణంగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఏపీలో మాత్రం కొత్త ప్రభుత్వంతోపాటు కొత్త రాజధాని కోసం ఎన్నికలు నిర్వహించినట్టు ఉంది పరిస్థితి. వైసీపీ గెలిస్తే విశాఖ రాజధాని ఏర్పాటు ఖాయం. టిడిపి కూటమి గెలిస్తే మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా అవతరించడం తథ్యం.ప్రజాభిప్రాయం మేరకు రాజధాని నిర్మాణం చేస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిన ఫలితం బట్టి ఏపీకి రాజధాని నిర్మితం కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి ఇది సంక్లిష్ట సమయం. పార్టీల గెలుపోటములపై రాజధాని అంశం ముడిపడి ఉండడం విశేషం.

    పోలింగ్ ముగిసింది. మరో రెండు వారాల వ్యవధిలో కౌంటింగ్ జరగనుంది. జగన్ గెలిస్తే విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అదే టిడిపి గెలిస్తే చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. అంటే గెలిచే పార్టీ బట్టి.. ప్రమాణస్వీకారం చేసే ప్రాంతం బట్టి.. రాజధాని నిర్మాణం ప్రారంభించనున్నారు అన్నమాట. అందరి ఆమోద ముద్రతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం వివాదంగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారన్న విమర్శను జగన్ ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు ఇదే అస్త్రంగా మారింది.

    ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ఎన్నికల్లో రాజధాని అంశమే హైలెట్ అయింది. అమరావతి వర్సెస్ విశాఖ అన్న పరిస్థితి మారింది. అయితే జూన్ 4న ఫలితం బట్టి ఏపీకి రాజధాని ఏంటనేది ఒక స్పష్టత రానుంది. గత ఐదు సంవత్సరాలుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. వైసీపీ గెలిస్తే అమరావతి రైతుల ఆశలు అడుగంటినట్టే. వారి పోరాటం నిష్ఫలంగా మారినట్టే. అదే టిడిపి కూటమి గెలిస్తే మాత్రం అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయనుంది. చెదలు పట్టిన నిర్మాణాలు, ఐదేళ్లుగా కళావిహీనంగా మారిన అమరావతి ప్రాంగణం.. సరికొత్త కలను సంతరించుకొనుంది. ఏపీ ఎన్నికల్లో గెలుపు ప్రజలకే కాదు.. రాజధాని అంశానికి.. ఒక సంక్లిష్ట పరిస్థితికి పరిష్కార మార్గం చూపనుంది.