Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ రెడ్ బుక్ ఎవరికి ప్రమాదకరం?

Nara Lokesh: లోకేష్ రెడ్ బుక్ ఎవరికి ప్రమాదకరం?

Nara Lokesh: లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? వారిపై తీసుకునే చర్యలేమిటి? వారి విషయంలో కొత్త ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? అంటూ చాలామంది అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పోలీస్ అధికారుల నుంచి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అటు అధికారులు ఎక్కడికక్కడే అడ్డగించారు. అదే సమయంలో తమకు ఎదురైన ఇబ్బందులు, కేసులను టిడిపి శ్రేణులు ఏకరువు పెట్టాయి. ఆ సమయంలోనే లోకేష్ చేతిలో ఒక రెడ్ బుక్ కనిపించింది. పాదయాత్ర ముగింపు సభలో లోకేష్ అదే బుక్ ను అందరికీ చూపించారు. అధికార వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అన్యాయంగా కేసుల్లో ఇరికించిన అధికారుల పేర్లను ఈ బుక్ లో రాశామని.. అధికారంలోకి వచ్చిన మరుక్షణం వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు.

అయితే ఈ రెడ్ బుక్ అంశం వివాదాస్పదంగా మారింది.సుప్రీం కోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో ఈ బుక్ ప్రస్తావన కూడా వచ్చింది.రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని లోకేష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. తమపై ఉన్న కేసులను నీరుగారిచే ప్రయత్నం చేస్తున్నారని నాడు సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం లోకేష్ కు కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగియడం.. కూటమికి సానుకూల పవనాలు వీస్తుండడంతో రెడ్ బుక్ అంశం తెరపైకి వచ్చింది. ఆ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి? వైసీపీకి సహకరించిన అధికారులు ఎవరు? అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఏపీలో విధ్వంసకర పాలన ప్రారంభమైంది. వస్తూ వస్తూ ప్రజావేదికను కూల్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారు. చివరకు స్మశాన వాటికలను సైతం వైసీపీ రంగులతో నింపేశారు. అయితే నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వమే అయినా.. అమలు చేసింది మాత్రం ముమ్మాటికీ అధికారులే. ఇక కేసుల గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఎంతలా వేధించాలో అంతలా చేశారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అంటే రాష్ట్ర డిజిపి నుంచి కిందిస్థాయి ఎస్సై వరకు.. వ్యవస్థలో చాలామంది అధికారులు వైసీపీ నేతలకు సహకరించిన వారే. అటువంటి వారు ఇప్పుడు భయపడుతున్నారు. కిందిస్థాయి నాయకులతో తమకు ముప్పు లేకుండా ముందస్తు ఒప్పందాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు చర్చకు దారి తీయడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version