AP Elections 2024: ఎన్నికల టైంలో డబ్బుల విడుదల.. టీడీపీ, వైసీపీల్లో ఎవరికి ప్రయోజనం?

గత ఐదు సంవత్సరాలుగా జగన్ సంక్షేమ తారకమంత్రాన్ని నమ్ముకున్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కానీ చాలా వరకు పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 10, 2024 5:31 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో ఎన్నికల ముంగిట సంక్షేమ పథకాల నిధుల జమకు సంబంధించి రాజకీయం నడుస్తోంది. గతంలో జగన్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి లబ్ధిదారులకు నిధుల విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ హైకోర్టు ఒక్కరోజు స్టే విధించింది. శుక్రవారం ఒక్కరోజే సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కిన నిధులవిడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో ఎటువంటి ఆర్భాటం చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇది గేమ్ చేంజర్ అవుతుందని వైసిపి భావిస్తోంది. కానీ ఇందులో ప్రభుత్వ చిత్తశుద్ధి లేదని.. సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అభిప్రాయం మారిందని.. ప్రభుత్వానికి అమలు చేయాలని ఉద్దేశం ఉంటే.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అమలు చేసి ఉండేదని విపక్షాలు చెప్పుకొస్తున్నాయి.

గత ఐదు సంవత్సరాలుగా జగన్ సంక్షేమ తారకమంత్రాన్ని నమ్ముకున్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కానీ చాలా వరకు పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధిస్తున్నారు. ఏడాదికేడాది సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కానీ గణాంకాలను చూస్తూ తమది సంక్షేమ ప్రభుత్వమని వైసిపి నేతలు చెప్పుకొస్తూ వచ్చారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో గత ఐదేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చివరి ఏడాదికి వచ్చేసరికి రుణ పరిమితి దాటిపోయింది. సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. రాష్ట్రంలో టిడిపి కూటమిలోకి చేరింది. దీంతో కేంద్రం నుంచి సహాయ నిరాకరణ సైతం ఎదురయ్యింది.

ఈ ఏడాది సంక్రాంతి నుంచి జగన్ బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి.. చాలా వాటికి నిధులు జమ కాలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. వైయస్సార్ ఆసరా, విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వంటి వాటి విషయంలో లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పలేదు. ఎప్పుడో నెలల ముందు ఈ పథకాలకు సంబంధించి జగన్ బటన్ నొక్కారు. కానీ నిధులు జమ కాలేదు. అటు ఎన్నికల నిబంధనలతో.. ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దీని వెనుక తెలుగుదేశం హస్తం ఉందని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కు నెలల ముందు బటన్ నొక్కిన పథకాలకు నిధులు జమ కాకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ సైతం ఇదే విషయం లేవనెత్తింది. అయితే సంక్షేమ పథకాల అమలు విషయములో జగన్ కు క్రెడిబిలిటీ ఉండడంతో ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్ముతూ వచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, బాధిత వర్గాలు మాత్రం.. పథకాల అమలు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బటన్ నొక్కిన రెండు మూడు రోజుల్లో నిధులు జమ చేసేది అని చెప్పుకొస్తున్నారు.