Real Estate AP: ప్రభుత్వ విధానాలతోనే కొన్ని రంగాల అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వం నిబంధనలు కఠిన తరం చేసినా.. అనుబంధ రంగాల విషయంలో ఆంక్షలు విధించినా.. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో కొన్ని రంగాలు కనీస స్థాయిలో కూడా ఉనికి చాటుకోలేకపోయాయి. అందులో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఐదేళ్లలో పురోగతి దిశగా ముందుకు వెళ్లకపోగా.. ఎక్కడి వారు అక్కడే నిర్మాణాలను నిలిపివేశారు. కొందరు హైదరాబాద్, మరికొందరు బెంగళూరు( Bengaluru) వంటి నగరాల వైపు వెళ్లిపోయారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం పడకేసిన తరువాత ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఐదు సంవత్సరాల స్తబ్దత నుంచి రమేపి రికవరీ ప్రారంభం అయ్యింది. ఇది ఏపీకి ఆదాయపరంగా శుభపరిణామమే. అభివృద్ధికి ఆనవాళ్లుగా నిలుస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కనిపిస్తోంది.
* పెరిగిన భూ క్రయవిక్రయాలు
కూటమి( alliance) వచ్చిన ఈ 16 నెలల కాలంలో భూ సంబంధిత లావాదేవీలు, క్రయవిక్రయాలు గణనీయంగా పెరిగాయి. 35 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైసిపి హయాంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. నిర్మాణ రంగం కుదేలు అయింది. దానిని గుణ పాఠాలుగా నేర్చుకుంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం సంస్కరణలకు సిద్ధం అయ్యింది. అమరావతి పునరుద్ధరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కొత్త పాలసీలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. ఇదే ఊపుతో కొనసాగితే ఏపీలో నిర్మాణరంగం మరింత బలపడినట్టే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య.. మూడు నెలల కాలంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 46% పెరుగుదల. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. దానికి ఒకే ఒక్క కారణం అమరావతి పునర్నిర్మాణం. ప్రభుత్వ సంస్కరణలు దోహదపడ్డాయి కూడా. ఒక్క ఫిబ్రవరిలోనే 68 వేల భూ క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.
* అమరావతి పునర్నిర్మాణంతో..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం అంత ఊపొందుకోలేదు. కానీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ఎప్పుడైతే ప్రారంభం అయ్యాయో అప్పుడే రియల్ ఎస్టేట్ మరింత పెరగడం ప్రారంభం అయింది. భూముల ధరలు కూడా 15 నుంచి 25% ఒకేసారి పెరిగాయి. మరోవైపు నిర్మాణ రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించింది. ప్రభుత్వ బిల్డింగ్, లేఅవుట్ అప్రూవల్ రెగ్యులేషన్లను సరళీకరించింది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొంత ఊతం ఇచ్చింది. అమరావతిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, బిట్స్ పిలాని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్యాంపస్ వంటి ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుండడంతో.. సహజంగానే దాని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది.
* గణనీయమైన వృద్ధి..
రాష్ట్ర ఆదాయంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి 10.5% వృద్ధి కనిపించింది. దీంతో సహజంగానే ఆ రంగాల్లో రాణిస్తున్న ఇతర రాష్ట్రాల వారు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు. ఆపై విశాఖపట్నంలో కూడా వృద్ధి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ భారీ స్థాయిలో ఐటీ పరిశ్రమలు, దిగ్గజ ఐటీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అనేది గేమ్ చేంజర్. ఒక్కమాటలో చెప్పాలంటే అమరావతి తో పాటు విశాఖ ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. ఆపై అన్ని రంగాల అభివృద్ధికి నాంది అని చెప్పవచ్చు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం శుభ పరిణామం. 35 శాతం వృద్ధిరేటు ఆషామాషీ విషయం కాదు.