Amaravati Real Estate: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా రకాల ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం తమకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. మరోవైపు ప్రైవేటు కంపెనీలు సైతం తమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటులో చట్టం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానికి గతంలో ఎదురైన పరిణామాలు… భవిష్యత్తులో ఎదురు కాబోవని అంతా భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమరావతి రాజధాని లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం విశేషం. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి వైపు వస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు తో పాటు కృష్ణా జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది.
Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?
* ఏకాభిప్రాయంతో అమరావతి..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగానే సాగాయి. పెద్ద ఎత్తున వెంచర్లు కూడా పడ్డాయి. అంతేకాదు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. వెంచర్లలో ప్లాట్లను కూడా కొనుగోలు చేశారు. దీంతో అప్పట్లో రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో ముందుకు సాగింది. పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ముందుకు సాగింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారింది. మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రశ్నార్థకంగా మారింది. కనీస కార్యకలాపాలు నిలిచిపోవడంతో అమరావతి అటవీ ప్రాంతంగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం అమాంతం పడిపోయింది. ఆ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు.
* జగన్ చర్యలతో..
వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సైతం అమరావతి రాజధానిని కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2020లో మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో ఒక్కసారిగా అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆ తరువాత వ్యాపార వర్గాలు హైదరాబాదును ఎంచుకోవడంతో అక్కడి ప్రభుత్వం వ్యాపారులను స్వాగతించింది. అప్పట్లోనే ఏపీలో జగన్ ఉంటే తమ వ్యాపారాలు బాగుంటాయని తెలంగాణ పాలకులు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. గత ఐదు సంవత్సరాల్లో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. దీంతో దాదాపు 50 వేల ఎకరాల భూములు అడవిలా మారిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. వాస్తవానికి టీడీపీ కూటమి వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. అయితే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం విస్తృతికి అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. దీంతో తొలి ఏడాదిలో అమరావతి వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చూడలేదు. దీనిని గుర్తించిన సీఎం చంద్రబాబు అమరావతిని విస్తరించి ప్రయత్నాలను చేసి చూపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అమరావతిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్లు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. వందలాది, వాహనాలు యంత్రాలు, కార్మికులు, ఉద్యోగులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం తుళ్లూరు, వెంకటాయపాలెం, మంగళగిరి ప్రాంతాల పరిధిలో రోజుకు కనీసం 20 నుంచి 30 రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం విశేషం.