BRS Merger BJP: భారతీయ జనతా పార్టీ తన ప్రాభావాన్ని చాటుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పై విలీనాస్త్రం సంధించింది. పార్టీలో అంతర్గత పోరు, కేసులతో సతమతమవుతూ క్రమక్రమంగా క్షీణిస్తున్న దశలో చేరికల పర్వానికి తెరలేపింది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై కన్నువేసింది. అక్కడ గతంలో క్రియాశీలకంగా వ్యవహరించి, కేసీఆర్ కు బలమైన మద్దతునిచ్చే నాయకత్వంను తమవైపుకు తిప్పుకునేందుకు వేసిన పాచిక పారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే లను చేర్చుకునేలా వేసిన ప్లాన్ విజయవంతమైంది. పార్టీ అధికారంలో ఉండగానే వీరిని బీజేపీ వైపు ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నం చివరి క్షణంలో కేసీఆర్ గండికొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ ఎపిసోడ్ లో ఉన్న అప్పటి ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం మాజీలుగా బీజేపీ కి జై కొట్టడం ఆశ్చర్యానికి దారితీస్తోంది.
Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?
*అసలేమీ జరిగింది*
దక్షిణ తెలంగాణ లోని జిల్లాల్లో గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు తమ నివాసాన్ని దాదాపు హైదరాబాద్ కు మార్చుకున్నారు. దీంతో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించలేక, వారు పట్టుకోల్పోయి గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే గత ఒకటిన్నర సంవత్సరాలుగా పార్టీలో అంతర్యుద్ధం, లుకలుకలతో పాటు, కవిత జైలుపాలు కావడం, పార్టీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, వరుస కేసుల్లో పార్టీ పెద్ద నాయకులు విచారణలు ఎదుర్కోవడం అనే అంశాలతో పాటుపార్టీ బీజేపీ తో విలీనమౌతున్నది అనే ప్రచారం హోరెత్తింది.
జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ప్రదర్శించాలనే ఆలోచన చేస్తున్న సమయంలో బీజేపీ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధినాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చినా, వారిని కేసీఆర్ ఆపేందుకు ప్రయత్నం చేయలేదంటే పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ మౌనం వహించడం, ఫాంహౌస్ కు పరిమితం కావడం వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని ఆయనకు, పార్టీకి అత్యంత సన్నిహితులు మీడియాలో నెత్తినోరు మొత్తుకొంటున్నారు. దీంతో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.