Rayudu Military Hotel: వ్యాపారాల కోసం కొందరు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అని ఒకరు.. పైసా పైసా ఆదా చేయండి.. భూమిపై పెట్టుబడి పెట్టండని మరొకరు.. ఇలా ఎవరికివారుగా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. రాజమండ్రి కి ( Rajahmundry ) చెందిన ఓ వ్యక్తి అయితే ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో హోటల్ ఏర్పాటు చేశారు. అది కూడా నాన్ వెజ్ రెస్టారెంట్ కు ఆ నమూనా ను తీర్చిదిద్దారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుత్వ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ హోటల్ నమూనా పైనే అంతటా చర్చ నడుస్తోంది.
Also Read: తల్లిదండ్రులు, సోదరుడు చనిపోయారు.. మూడేళ్లుగా ఆ రూం దాటి బయటకు రాలేదు.. ఓ టెకీ విషాద గాథ
* రాజమండ్రి సమీపంలో..
జాతీయ రహదారిపై రాజమండ్రి సమీపంలో రాయుడు మిలిటరీ హోటల్( Military Hotel) ఉంది. అక్కడ శ్రీవారి గర్భాలయం నమూనాను ఏర్పాటు చేశారు. జయ విజయాలతో పాటు బంగారు వాకిలి, రాముల వారి మేడ, కుల శేఖర పడితో కూడిన నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ నమూనాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాత్రం ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రియాక్ట్ అవుతున్నారు.
* జనసేన నేతల ఫిర్యాదు..
మరోవైపు ఈ ఘటనపై జనసేన నేత కిరణ్ రాయల్( Kiran Royal ) స్పందించారు. తక్షణం ఆ హోటల్ ను మూసివేయాలని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో ఆ దేవుడు ప్రసాదాన్ని లక్షల మందికి పెడుతుంటే.. వ్యాపార స్వార్థంతో అదే స్వామివారి ఆలయ నమూనాను వాడుకుంటారు అంటూ ఆయన ఆగ్రహించారు. ఇది లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటన అని అభివర్ణించారు. వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు జనసేన నేతలు టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ఫిర్యాదు అందించారు. టిటిడి అధికారుల సైతం వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. హైవే అథారిటీస్ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. 48 గంటల్లో ఆ హోటల్లో ఉన్న నమూనాను తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హిందుత్వవాదులు చెబుతున్నారు.
