Ramoji Rao: మార్గదర్శి సంస్థలో ప్రతినెలా చిట్స్ వేసిన చందాదారులకు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదా? రసీదులు రాసి మాత్రమే ఇస్తున్నారా? అలా చేయడం చిట్ ఫండ్ చట్టాలకు వ్యతిరేకమా? చివరికి ఏపీ సిఐడి అధికారులను కూడా రామోజీరావు తన పలుకుబడి ఉపయోగించి ఇబ్బంది పెడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతోంది సాక్షి.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో అక్కడ రెండు బలమైన మీడియా సంస్థలు గా ఉన్న ఈనాడు, సాక్షి పోటాపోటీగా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. (ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి కూడా ఉంటుంది. కాకపోతే దానిని జగన్ అనుకూల మీడియా తోక పత్రికగా అభివర్ణిస్తూ ఉంటుంది.) అటు ఈనాడు చంద్రబాబు అనుకూల వార్తలు, వైసిపి వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూ ఉంటే.. ఇటు సాక్షి జగన్ అనుకూల వార్తలు, టిడిపి వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూ ఉంటుంది. ఈ రెండు బలమైన మీడియా సంస్థలు గతంలో ఎప్పుడో ఒకసారి ఒకదాని మీద మరొకటి బురద చల్లుకునేవి. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తర్వాత రోజూ బురద చల్లుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా సాక్షి రామోజీరావు పై “గురివింద రామోజీ” అనే శీర్షికన వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా ఆయన స్థాపించిన మార్గదర్శి సంస్థలో లొసుగులను ప్రధానంగా బయటపెడుతోంది. మార్గదర్శి ద్వారా రామోజీరావు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని, చిట్ ఫండ్ చట్టాలను అమలు చేయడం లేదని, చందా దారులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని సాక్షి ఆరోపిస్తోంది. పైగా ఇటీవల మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం దాడులు చేసిన నేపథ్యంలో.. కొంతమంది బాధితులు సిఐడి అధికారులను ఆశ్రయించారని.. వారిని రామోజీరావు మనుషులు భయపెడుతున్నారని సాక్షి రాసుకొచ్చింది. మార్గదర్శి బాధితుల సంఘం త్వరలో ఆందోళనలు కూడా చేయబోతుందని సంచలన విషయం రాసింది.
అయితే ఇన్ని విషయాలు రాసిన సాక్షి.. ఆ బాధితుల ఫోటోలు లేకుండా(వారికి ఇబ్బందులు ఉన్నాయని చెబుతోంది కాబట్టి).. రామోజీరావు పెడుతున్న ఇబ్బందులను రాయవచ్చు కదా? ఏకంగా చందాదారులనే బెదిరిస్తున్నారంటే అక్కడి పోలీసులు ఏం చేస్తున్నట్టు? వాళ్లు వచ్చి బెదిరించిన తర్వాత పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారా? అప్పుడు అక్కడ పోలీసు వ్యవస్థ విఫలమైనట్టే కదా? ఇప్పటికే సిఐడి ఈ కేసును విచారిస్తున్న నేపథ్యంలో బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ విభాగానికి ఉంటుంది కదా? అంటే సిఐడి పోలీసులు కూడా జస్ట్ బాధితుల నుంచి వివరణ తీసుకొని వదిలేశారా? సాక్షి రాసిన కథనం పూర్తిగా చదివిన తర్వాత ఇటువంటి ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఎన్నికలవేళ అటు సాక్షి, ఇటు ఈనాడు తమ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని మరింత నిర్లజ్జగా భ్రష్టు పట్టిస్తున్నాయి.