Ramoji Rao : లాకప్ లో గడిపిన రాజగురువు రామోజీ

అబిడ్స్ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెనుక సీనియర్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ రాసిన ఒక వ్యాసం కూడా ఉందని ఉండవల్లి గుర్తుచేశారు. దీనిపై త్వరలో మీడియాతో మాట్లాడేటప్పుడు స్పష్టతనిస్తానని ఉండవల్లి చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : May 8, 2023 11:19 am
Follow us on

Ramoji Rao : బిగినింగ్ స్టేజ్ లో మీడియా మొఘల్ లాకప్ లో గడిపారా? దేశంలోనే శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న రాజగురువు కటకటలపాలయ్యారా? జైలు నుంచి వచ్చిన తరువాతే మార్గదర్శిని రిజిస్టర్ చేశారా? తరువాత ఈనాడును స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఈ విషయాలపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. మార్గదర్శిపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ పలు అంశాలు పేర్కొంటూ వీడియో సంభాషణ కొనసాగింది. తెలుగునాట చర్చనీయాంశంగా మారింది.

హైప్రొఫైల్ కేసు..
గత కొన్నిరోజులుగా మార్గదర్శిపై ఉండవల్లి పోరాడుతున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం సైతం సీబీసీఐడీ విచారణ చేపడుతోంది. దీంతో ఇదో హై ప్రొఫైల్ కేసుగా మారింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మార్గదర్శిపై విచారణ కొనసాగుతున్నా.. ఆ సంస్థ కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తూ వచ్చింది. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులే లేని కేసు మాత్రం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అందుకు రామోజీరావు వెనుక ఉన్న ఈనాడే కారణం. రామోజీరావు రాజకీయాలను శాసిస్తుండడమే కారణం. అటు ఉండవల్లి సైతం మార్గదర్శి కేసు ద్వారానే ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు ఒకే సమయంలో అటు ప్రభుత్వం ఇటు ఉండవల్లి పట్టుబిగుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ వీడియోలో ఉన్నది నిజమేనా?
ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఉండవల్లి సంభాషణలతో కూడిన ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మార్గదర్శి చిట్స్ పెట్టకముందే అనాధరైజ్డ్ గా చిట్స్ రన్ చేసిన కారణంగా అబిడ్స్ పోలీసలు రామోజీని పిలిపించి, నాలుగు రోజులు లాకప్ లో వుంచారన్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ విషయం ప్రసాద్ అనే ఆయన చెప్పారని, తనకు త్వరలో పూర్తి వివరాలు ఇస్తా అన్నారని ఉండవల్లి చెప్పారు.ఈ విషయం అప్పారావు గారికి తెలుసు అని ఉండవల్లి అనడం ఆ వీడియోలో వుంది. మరి అప్పారావు ఎవరనేది ఇప్పుడు ప్రశ్న. రామోజీరావు తోడల్లుడు పేరు అప్పారావే. ఆయన డాల్ఫిన్ అప్పారావుగా పేరుంది.

మరెన్నో విషయాలు..
అయితే రామోజీరావు గురించి చాలా విషయాలు తనకు తెలుసునని ఉండవల్లి చెబుతున్నారు. ఆయన గురించి ఎన్నో ఫిర్యాదులు తనకు వస్తున్నాయని చెప్పారు. ఆయనపై పోరాడుతున్న వ్యక్తిని కావడంతో అటువంటి ఫిర్యాదులు రావడం కామనేనన్నారు. చాలా మంది ఆయన వ్యక్తిగత, సంస్థలపరమైన సమాచారాన్ని మెయిల్స్, వాట్సాప్ లో పంపిస్తున్నారని చెబుతున్నారు. అయితే వాటి విషయం పట్టించుకుంటే మార్గదర్శి అంశం పక్కకు తప్పుకునే అవకాశముందన్నారు. అందుకే వాటిని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెనుక సీనియర్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ రాసిన ఒక వ్యాసం కూడా ఉందని ఉండవల్లి గుర్తుచేశారు. దీనిపై త్వరలో మీడియాతో మాట్లాడేటప్పుడు స్పష్టతనిస్తానని ఉండవల్లి చెబుతున్నారు. సో అప్పటివరకూ ఆగాలన్న మాట.