Ramoji Rao Passed Away: రామోజీ తర్వాత ఈనాడు’ వారసులు ఎవరు? ఆ స్థాయిలో సాధ్యమేనా?

రామోజీరావుకు బాపినీడు రూపంలో వెన్నెముక ఉండేది. ఆయన కష్టాల్లో, సుఖాల్లో బాపినీడు పాత్ర విడదీయ లేనిది. రామోజీ జీవితంలో భాగస్వామి రమాదేవి తర్వాత ఆ స్థాయి వ్యక్తి బాపినీడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 1:28 pm

Ramoji Rao Passed Away

Follow us on

Ramoji Rao Passed Away: ఎక్కడో విశాఖపట్నం జిల్లాలో ప్రారంభమైన ఈనాడు అనితర సాధ్యమైన స్థాయిలో ఎరిగింది. బేగంపేట కేంద్రంగా ఏర్పాటైన మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ శిఖర స్థానంలో నిలిచింది. ఈటీవీ, ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, బ్రిసా, ఈటీవీ భారత్, ఉషా కిరణ్ మూవీస్, డాల్ఫిన్ హోటల్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. వీటన్నింటికీ పునాది వేసింది.. మహావృక్షంగా ఎదిగేలా చేసింది మాత్రం రామోజీరావు. ఆయన కార్యదక్షిత.. అకుంఠిత దీక్ష ఆ సంస్థలను ఆ స్థాయిలో నిలబెట్టాయి. 88 సంవత్సరాల వయసులో రామోజీరావు కాలం చేశారు. వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన దిగంతాలకు వెళ్లిపోయారు.. మహా వృక్షం లాంటి ఆ సంస్థలను ఇప్పుడు ఎవరు కాపాడుతారు? వాటికి ఎవరు రక్షణగా నిలుస్తారు? రామోజీ లేని లోటును భర్తీ చేయడం సాధ్యమేనా?

ముందుచూపు ఎక్కువ

రామోజీరావుకు ముందుచూపు చాలా ఎక్కువ. వచ్చే 20 ఏళ్ల కాలాన్ని ముందుగానే ఊహించి.. దానికి తగ్గట్టుగా అంచనాలు రూపొందించడంలో ఆయన దిట్ట.. అలాంటి రామోజీరావు చేసిన వ్యాపారాలలో నష్టాలు కూడా ఉన్నాయి. ఫెర్టిలైజర్ వ్యాపారం ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది.. సోమా కూల్ డ్రింక్ నష్టాలు తెచ్చి పెట్టింది.. కొన్ని పత్రికలు ప్రారంభిస్తే.. అవి కూడా ఇబ్బంది కలిగించాయి. ఆ కష్టాలను గెలుపు పాఠాలుగా మార్చుకొని రామోజీరావు తనను తాను మీడియా మొఘల్ గా ఆవిష్కరించుకున్నారు. తన సంస్థలను అంతకంతకూ ఎదిగేలా చేసుకున్నారు. చిన్న కుమారుడు సుమన్ తో విభేదాలు తలెత్తడంతో దూరం పెట్టారు. అంతేతప్ప కొడుకని వాత్సల్యం చూపించలేదు. ఎందుకంటే జీవితంలో ప్రతి విషయాన్ని వ్యాపార కోణంలో చూసే రామోజీరావు.. తన తర్వాత తాను ఏర్పాటు చేసిన సంస్థలను విజయవంతంగా నడిపించేందుకు.. మరో తరాన్ని కూడా తయారు చేశారు.

రామోజీరావుకు బాపినీడు రూపంలో వెన్నెముక ఉండేది. ఆయన కష్టాల్లో, సుఖాల్లో బాపినీడు పాత్ర విడదీయ లేనిది. రామోజీ జీవితంలో భాగస్వామి రమాదేవి తర్వాత ఆ స్థాయి వ్యక్తి బాపినీడు. ఆ మధ్య ఆయన కన్నుమూసినప్పుడు రామోజీరావు మానసికంగా వేదన చెందాడు. శారీరకంగా కుమిలిపోయారు. వాస్తవానికి ఏ విషయంలోనూ ఇబ్బంది పడని, కలత చెందని రామోజీరావు.. బాపినీడు మరణం తర్వాత తీవ్రంగా నిర్వేదంలో కూరుకుపోయారు. బాపినీడు ఉన్నంతవరకు రామోజీరావు తన కుటుంబ సభ్యులను మరింత లోతుగా సంస్థల్లో వేలు పెట్టనిచ్చేవారు కాదు. ఆయన మరణం తర్వాత తన సంస్థలను కుటుంబ సభ్యులతో వీకేంద్రీకరించడం మొదలుపెట్టారు.

ముందుగానే చెప్పినట్టు ఒక తరాన్ని తయారు చేసుకున్న రామోజీరావు.. తాను బతికి ఉన్నప్పుడే ఆయా శాఖలను వారికి కేటాయించారు. అన్నదాత, విపుల, చతుర, బాల భారతం వంటి వాటిని మూసివేసిన తర్వాత.. ఈనాడు బాధ్యతలను పెద్ద కుమారుడు కిరణ్ కు, ఫిలిం సిటీ బాగోగులను విజయేశ్వరికి, మార్గదర్శి వ్యవహారాలను శైలజకు, ఈటీవీ భారత్ బృహతికి, ఇక మిగతా సంస్థల బాధ్యతలను సుమన్ కుమారుడు, కిరణ్ కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించేశాడు. అయితే తన చివరి శ్వాస వరకు కూడా రామోజీరావు ఈనాడు కోసమే పని చేశారు. తన జీవిత కాలం ముగింపులోనూ ఈనాడు పత్రిక చదివి.. ఎడిటోరియల్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎక్కడో కృష్ణాజిల్లాలో రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు హైదరాబాద్ దాకావిస్తరించారు. పత్రిక, పచ్చళ్ళు, సినిమా, వస్త్రాలు, ఇంకా చాలా వ్యాపారాలలో అడుగుపెట్టారు. అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ప్రస్తుత తరం చేతిలో ఆ వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతాయా? లేక మరొకరి చేతుల్లోకి వెళ్తాయా అనేది పక్కన పెడితే.. రామోజీ అనే పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఆ చంద్ర తారార్కం ఆ కీర్తి వెలుగులీనుతూనే ఉంటుంది.