Ramoji Rao VS YS Jagan : జగన్ సర్కారు ప్రకటనలు వద్దంటున్న రామోజీరావు.. అసలు కథేంటి?

మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన  ప్రకటన ఈనాడు పేపర్‌లో రాలేదు. సాక్షిలో మాత్రేమే వచ్చింది. అయితే ఇప్పటివరకూ యాడ్ల రూపంలో పొందినది.. గత ప్రభుత్వంలో అయాచితంగా పొందిన యాడ్ల విషయంలో మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Written By: Dharma, Updated On : May 22, 2023 5:59 pm
Follow us on

Ramoji Rao VS Ys Jagan : రామోజీరావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక బ్రాండ్. ఒక మీడియా సంస్థ అధిపతిగా, వ్యాపారవేత్తగానే కాకుండా.. అంతకుమించి అన్నంతగా ఆయన తన పేరు ప్రఖ్యాతలను విస్తరించుకున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులను కూడా సునాయాసంగా ఎదుర్కొన్న ధైర్యశాలి. తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి. అన్ని వ్యవస్థల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తులని ఏర్పాటు చేసుకున్న అపర మేధావి. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రస్థానం.. ఈనాడుతో పతాక స్థాయికి చేరి మీడియా మొగల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే ఎవరికీ వెరవని రాజగురువు రామోజీరావు ఇప్పుడు జగన్ అంటేనే భయపడిపోతున్నారు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన యాడ్లు సైతం తన ఈ నాడులో ప్రచురించేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కారును ఈనాడు వెంటాడుతూ వస్తోంది. అయినా ఈనాడుకు ప్రకటనల పరంగా జగన్ తక్కువ చేయలేదు. అయితే తక్కువ చేయడానికి వీలులేదు. తెలుగులో అత్యధిక సర్వ్యూలేషన్ ఉన్న పత్రిక కావడంతో తప్పనిసరిగా యాడ్స్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా తన సాక్షి  పత్రికకు ప్రకటనలు ఇవ్వాలంటే.. ఈనాడుకూ ఇవ్వాల్సిందే. ఈనాడుకు అరకొరగా ఇస్తూ.. తమ పత్రికలు, అస్మదీయ పత్రికలు, చానళ్లకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. కనీసం రూ. ఐదు వందల కోట్లు సాక్షి ఖాతాకు చేరి ఉంటాయని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈనాడు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందన.. ఆ ప్రభుత్వం ఇచ్చే యాడ్లు తీసుకోకూడదని డిసైడయినట్టు సమాచారం.

ఏపీలో సంక్షేమ పథకాల కంటే.. ప్రకటనల రూపంలోనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుడికి సాయం చేరక ముందే ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు మీడియాకు చేరుతున్నారు. కట్టని.. పెట్టని వాటికి శంకుస్థాపనలు చేస్తూ.. ఆ పేరుతో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తోంది. గట్టిగా ఐదు కోట్లు కూడా పంపిణీ చేయని పథకాలకు పది కోట్లకపైగా ప్రకటనలు ఇస్తోంది. ఇందులో ఈనాడుకూ ఇప్పటి వరకూ ప్రకటనలు ఇచ్చేవారు. నిబంధనల ప్రకారం.. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికకు ప్రకటనలు ఇవ్వాల్సిందే.

అయితే వైసీపీ సర్కారుపై పోరాటం చేస్తున్న క్రమంలో ఈనాడు ప్రత్యర్థిగా నిలుస్తోంది. అందుకే జగన్ సైతం రామోజీరావును టార్గెట్ చేశారు. అసలు ఫిర్యాదుదారులే లేని మార్గదర్శి కేసులో వెంటాడుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రజాధనంతో ఇచ్చే తప్పుడు సమాచార ప్రకటనలను తమ పత్రికలో వేయడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చినట్లుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన  ప్రకటన ఈనాడు పేపర్‌లో రాలేదు. సాక్షిలో మాత్రేమే వచ్చింది. అయితే ఇప్పటివరకూ యాడ్ల రూపంలో పొందినది.. గత ప్రభుత్వంలో అయాచితంగా పొందిన యాడ్ల విషయంలో మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.