Ram Mohan Naidu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేనంతగా ఓటమి గత ఎన్నికల్లో ఎదురైంది. 175 స్థానాలకుగాను గెలిచింది 21 నియోజకవర్గాల్లోనే. 25 ఎంపీ స్థానాలకుగాను మూడింటితోనే సరిపెట్టుకుంది. అత్యధికంగా విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు ఆ పార్టీ దక్కించుకుంది. కొన్ని జిల్లాల్లో అసలు ఖాతాయే తెరవలేదు. అయితే అంతటి ప్రభంజనాన్ని కూడా ఎదురొడ్డి నిలిచింది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం. ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కుమార్తె భవాని ఎమ్మెల్యేలుగా గెలిచారు. కుమారుడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి విజయపరంపర కొనసాగించారు. అయితే ఆ కుటుంబ విజయాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించేందుకు డిసైడ్ అయ్యారు. బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ. అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అభ్యర్థిగా ముందుగానే ఫిక్స్ చేశారు. ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడుపై ఆర్థిక, అంగబలమున్న డాక్టర్ దానేటి శ్రీధర్ ను బరిలో దించనున్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను ఐదింట టీడీపీ ఓడిపోయింది. కానీ ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారంటే కింజరాపు కుటుంబానికి ఏ స్థాయిలో ఆదరణ ఉందో చెప్పనక్కర్లేదు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. అయితే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగే కాకుండా.. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రామ్మోహన్ నాయుడికి మద్దతు తెలిపారు. మంచి వాగ్ధాటి కలిగిన యువ నాయకుడిగా పార్లమెంట్ తో పాటు అన్ని వేదికల వద్ద గళం వినిపించారు. వివాదరహితుడిగా పేరుంది. అనివార్య పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లిన కింజరాపు కుటుంబాన్ని అభిమానించే నాయకులు రామ్మోహన్ నాయుడికి మద్దతు పలికారు. అందుకే ఆయన అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. ఈసారి కూడా ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీచేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే టీడీపీ హైకమాండ్ వేరే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీకి, చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకం. కేవలం గెలుపు అన్న తారకమంత్రం తప్పించి మరో ప్రాతిపదిక తీసుకోరాదని చంద్రబాబు భావిస్తున్నారు. ఎక్కడికక్కడే గెలుపు ఫార్ములాతో ముందుకు సాగాలని డిసైడ్ అవుతున్నారు. అందుకే ఈ సారి రామ్మోహన్ నాయుడును అసెంబ్లీ బరిలో దించాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ధర్మాన సోదరులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు క్రిష్ణదాస్ నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే రామ్మోహన్ నాయుడు నరసన్నపేటకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ధర్మాన, కింజరాపు కుటుంబాలది ఒకే సామాజికవర్గం. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా రెండు కుటుంబాల మధ్య లోపయికారీ రాజకీయం నడుస్తున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు కింజరాపు కుటుంబంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండేవారు. ఇప్పటికీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కానీ క్రిష్ణదాస్ మాత్రం గత కొద్ది రోజులుగా కింజరాపు కుటుంబానికి సవాల్ విసురుతూ వస్తున్నారు. అందుకే క్రిష్ణదాస్ ను పడగొట్టాలని కింజరాపు కుటుంబం డిసైడ్ అయినట్టు సమాచారం. అటు ధర్మాన సోదరుల మధ్య కూడా విభేదాలున్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి రేగింది. ప్రధానంగా అక్కడ కాపు, కళింగ వైశ్యులు వైసీపీకి దూరమవుతున్నారు. పైగా నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం అధికం. కింజరాపు కుటుంబ అభిమానులు ఎక్కువ. అందుకే రామ్మోహన్ నాయుడు నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని తేలుతోంది. అయితే మిగతా నియోజకవర్గాల టీడీపీ నాయకులు మాత్రం రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీచేస్తేనే.. ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాలపై చూపుతుందని చెబుతున్నారు. చుద్దాం చంద్రబాబు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో..