Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయనకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. వారం రోజులపాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. వైసిపి ప్రభుత్వ హయాంలో దూకుడుగా ఉండేవారు రాంగోపాల్ వర్మ. ఒకవైపు వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీస్తూనే.. సోషల్ మీడియాలో వైసీపీతో పాటు జగన్ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ఈ క్రమంలోనే వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టులు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. కానీ వైసీపీ అధికారంలోకి ఉండడంతో వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. విచారణకు హాజరుకావాలని రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చారు ప్రకాశం పోలీసులు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. తనపై వేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవి. అది వీలు కాదని తేల్చి చెప్పిన హైకోర్టు అవసరం అయితే.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ తరుణంలోరెండు రోజుల కిందట హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. వారం రోజులపాటు ఆర్జీవిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
* నెలనెలా జీతం
మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి రాంగోపాల్ వర్మ భారీ లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఆయనకు నెల నెల జీతం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ ఆయాంలో పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని సైతం ప్రకటించారు. యూట్యూబ్ లతోపాటు వెబ్సైట్ల పర్యవేక్షణ ఈ కార్పొరేషన్ బాధ్యత. అయితే వైసీపీ అస్మదీయ మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలను డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వైసిపి అనుకూల మీడియా యూట్యూబర్లకు, సోషల్ మీడియాలో వైసిపి ప్రత్యర్థులపై విరుచుకు పడే వారికి భారీగా నగదు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే రాంగోపాల్ వర్మ కు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి భారీగా చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* ఆ సినిమాలకు సైతం
మరోవైపు గత పది సంవత్సరాలుగా వైసీపీకి అనుకూలంగా.. ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పొలిటికల్ కంటెంట్ తో చాలా సినిమాలు తీశారు రాంగోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, శపధం వంటి సినిమాల్లో జగన్ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చూపించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబును నెగిటివ్ కోణంలో చూపించగలిగారు. అయితే ఈ చిత్రాలకు సైతం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాలకు నిర్మాతలు ఉన్నారు. నిర్మాణ సంస్థలు ఉన్నాయి. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు ఎలా చేశారు అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే డిజిటల్ కార్పొరేషన్ నుంచి కంటెంట్ రైటర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్ రూపంలో చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై లోతైన దర్యాప్తు చేసే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. త్వరలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు విషయంలో సంచలనాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ram gopal varma gets monthly salary from ap digital corporation for ycp social media posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com