Kiran Kumar Reddy: రాష్ట్రంలో మరో కొత్త ఎన్నికకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభకు( Rajyasabha ) ఉప ఎన్నిక జరగనుంది. దీంతో కూటమి పార్టీల్లో ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ఒక్కగానొక్క రాజ్యసభ పదవి ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థితి. కూటమిలో ప్రధాన పార్టీ అయిన టిడిపి నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. పదవి దక్కించుకునేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, దేవినేని ఉమా, దాడి వీరభద్రరావు లాంటి నేతలు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. అదే సమయంలో జనసేన నుంచి సైతం ఈసారి తమకు చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మొన్న టిడిపి రెండు పదవులతో పాటు బిజెపి ఒక పదవి తీసుకుంది. ఈసారి తమకు చాన్స్ ఇవ్వాల్సిందేనని జనసేన కోరుతోంది. దీంతో మూడు పార్టీల మధ్య గట్టి పోరు నడుస్తోంది.
* అమిత్ షా విన్నపం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడంతో చైర్మన్ ఆమోదించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం నోటిఫై చేయనుంది. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఖాళీ అయిన ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కూటమి పార్టీల్లో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న ఏపీలో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా.. ఈసారి రాజ్యసభ పదవిని తమకు వదిలివేయాలని కోరినట్లు తెలుస్తోంది.
* బిజెపి కి కేటాయిస్తే
అయితే విజయసాయిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం( ready caste ) కావడంతో.. బిజెపిలోని అదే సామాజిక వర్గానికి చెందిన నేతతో ఆ పదవి భర్తీ చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి( Kiran Kumar Reddy) అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీని విభేదించి 2014లో సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అటు తరువాత చాలా రోజులు సైలెంట్ అయ్యారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే బిజెపి పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు.
* ఎంపీగా ఓటమి
ఈ ఎన్నికల్లో బిజెపి( BJP) తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. రాజంపేట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత కొంతకాలంగా బిజెపి రాష్ట్ర చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో విభేదించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇంకోవైపు కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సైతం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. ఒకవేళ బిజెపి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పేరును చంద్రబాబు సిఫారసు చేసే అవకాశం కూడా ఉంది.