AP Rajya Sabha elections: ఏపీలో( Andhra Pradesh) ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఓ నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కాబోతున్నాయి. కొత్త పదవులు ఎంపిక జరగనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్.. తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చెందుతారు. అంటే నాలుగు స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. అందుకే ఈసారి మూడు పార్టీలు రాజ్యసభ పదవులను కోరుకుంటున్నాయి. అయితే బిజెపికి ఇప్పటికి రెండుసార్లు ఛాన్స్ దక్కింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ రెండు పదవులను కోరుకుంటుందన్న ప్రచారం నడుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వకూడదని టిడిపి సీనియర్లు కోరుకుంటున్నారు. జనసేనకు ఒకటి ఇచ్చి … మూడు పదవులు టిడిపి తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెండు పదవులు కావాలట..
బిజెపి( Bhartiya Janata Party) ఆలోచన వేరే విధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీ కి చెందిన పరిమళ్ నత్వానిని మరోసారి ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి హై కమాండ్ కోరుతోంది. ఆపై మిగిలిన మూడు రాజ్యసభ స్థానాలను చెరో పార్టీ దక్కించుకోవాలని సూచిస్తోంది. ఈ లెక్కన బిజెపికి రెండు సీట్లు వెళ్లిపోతే.. ఇక మిగిలింది రెండు సీట్లు మాత్రమే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రాజ్యసభ పదవుల భర్తీ జరిగింది. అందులో రెండు బీజేపీకి వెళ్ళగా.. రెండు టిడిపి దక్కించుకుంది. అయితే ఇప్పుడు టిడిపి సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ జరగడంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలి. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆ ఒక్క పదవితో సరిపెట్టుకోవాలి. మిగతా ఆశావహుల పరిస్థితి ఏంటనేది చూడాలి.
టిడిపిలో ఆశావహులు అధికం..
భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా బిజెపికి రాజ్యసభ సీట్లు అవసరం. అందుకే మిత్రపక్షాల ద్వారా లభించే స్థానాలపై సైతం ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పుడు ఏపీ నుంచి సింహభాగం పదవులు పొందాలని చూస్తోంది. కానీ ఆ పార్టీకి ఏపీలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయినా సరే రాజకీయ ప్రయోజనాలను ఏపీ నుంచి ఆశించడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు పదవుల కోసం వేచి చూస్తున్నారు. అటువంటివారు బిజెపి వైఖరిని తప్పుపడుతున్నారు. బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ పదవులు ఇవ్వొద్దని కోరుతున్నారు. ఈ విషయంలో అవసరమైతే నిరసనలు తెలియజేపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. జూన్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అంతకుముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?