Six-figure salary Jobs: ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. దీంతో చిన్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా.. లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల చైనాలో అయితే భారీగా నిరుద్యోగులు అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితే. కానీ అమెరికాలో ఆరంకెల జీతం ఇస్తామన్నా.. ఆ ఉద్యోగాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. సంవత్సరానికి లక్ష నుంచి 1.2 లక్ష డాలర్ల వరకు జీతం అందించే ఉద్యోగాలు వేలాది ఖాళీగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ట్రకింగ్, అత్యవసర సేవలు, ప్లంబింగ్, విద్యుత్ పనుల్లో పోస్టులు భర్తీ కావడం లేదు.
5 వేల మెకానిక్ పోస్టులు ఖాళీ..
ఆటో దిగ్గజం ఫోర్డ్ మొదటి ప్రపంచ యుద్ధంలో విమానాల తయారీలా ఇప్పుడు వాణిజ్య వాహనాల కోసం నైపుణ్య కార్మికులు వెతుకుతోంది. సీఈవో జిమ్ ఫార్లీ ప్రకారం, కంపెనీలో 5 వేల మెకానిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆధునిక పరికరాలతో సిద్ధంగా ఉన్న డీలర్‌షిప్‌లలో పని చేసే అవకాశం ఉన్నా, అభ్యర్థులు దొరకడం లేదు. దేశవ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆయన హెచ్చరించారు.
దరఖాస్తు చేయకపోవడానికి కారణాలు..
ఈ ఉద్యోగాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, యువత దూరంగా ఉండటానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఉన్నత జీతానికి 5–10 సంవత్సరాల అనుభవం, ఫ్లాట్ రేట్ వ్యవస్థలో వేగవంతమైన పని అవసరం. శరీరానికి ఒత్తిడి, గాయాల ప్రమాదం, సొంత సాధనాలపై ఖర్చు ప్రధాన సమస్యలు.
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, 2028 నాటికి 3.45 లక్షల ఖాళీలు ఉంటాయి. ఉద్యోగ విరమణలతో ప్రతి ఐదుగురికి ఇద్దరే భర్తీ కావటంతో లోటు పెరుగుతోంది. 2030 నాటికి 2.1 మిలియన్ తయారీ ఉద్యోగాలు ఖాళీగా ఉండవచ్చు. ఈ ట్రెండ్‌కు విద్యా విధానాలు, శిక్షణ ప్రోగ్రామ్‌లు మారాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.