AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు ,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రైతులు ఆందోళనతో గడుపుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత నెల చివరిలో ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఈదురు గాలులు వీచాయి. వేలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది. అయితే మధ్యలో మరో అల్పపీడనం భయం గొలిపింది. అది మరువక ముందే ఇప్పుడు తాజా ఆల్పపీడనం మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
* ధాన్యం కొనుగోలు వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాల నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని సంరక్షించుకునే పనిలో పడ్డారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. రకరకాల కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో నిబంధనలు సరళతరం చేయాలని కోరుతున్నారు.
* పెరుగుతున్న చలి
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖ మన్య ప్రాంతంలో ఉదయం 9 గంటల వరకు పొగ మంచు పడుతూనే ఉంది. ఉదయం 10 గంటల తరువాతే గిరిజనులు బయటకు రావాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం వరకు పొగ మంచు పడుతుండడంతో రోడ్డుపై రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. వాహనదారులు అసౌకర్యానికి గురికాక తప్పడం లేదు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప రాత్రి సమయాల్లో బయటకు రావద్దని చెప్పుకొస్తున్నారు.