Minister Nara Lokesh :ఏపీ ప్రభుత్వ సేవలతో పాటు పౌర సేవలు మరింత సరళతరం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. డాక్యుమెంట్ లతోపాటు ధ్రువపత్రాల కోసం ఆఫీసులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని భావిస్తోంది. వాట్సాప్ ద్వారా క్షణాల్లో పౌర సేవలు అందించాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంపై చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పష్టత ఇచ్చారు. వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించనున్నట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధ్రువపత్రాలు కావాల్సినవారు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. క్షణాల్లో వాట్సాప్ ద్వారా వాటిని పొందే అవకాశాన్ని కల్పించనుంది ఏపీ సర్కార్.
* ప్రభుత్వ సమాచారం అంతా ఒకచోట
మరోవైపు ఒకే వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జనన మరణ ధ్రువపత్రాల జారీకి పాటిస్తున్న విధానం పైన సమీక్ష చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యా శాఖలో అపార్ ఐడి జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను సరిచేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు నారా లోకేష్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక్క అమెరికాలోనే ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నారన్న లోకేష్.. ఈ తరహా విధానాన్ని ఏపీలోనూ తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఈ క్రమంలోనే ముందుగా వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు మెటాతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు.
* మెటా ప్రతినిధులతో ఒప్పందం
కొద్ది రోజుల కిందట మంత్రి నారా లోకేష్ మెటా ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాలు, జనన మరణ ధ్రువపత్రాల దగ్గర నుంచి కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, నల్ల పన్ను వంటి బిల్లుల చెల్లింపు వరకు అన్ని పౌర సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రక్రియ వేగంగా, సులువుగా కూడా ఉంటుంది. వాటిని ట్యాంపరింగ్ చేసి అవకాశం ఉండదని కూడా ప్రభుత్వం చెబుతోంది. మరో 10 రోజుల్లోనే 153 రకాల సేవలను అందుబాటులోకి తెస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో ఇది ప్రాధాన్యత అంశంగా మారిపోయింది.