AP Railways: ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ సిద్ధం చేసే పనిలో ఉంది. ఇది పూర్తి కాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. 11 రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. డిపిఆర్ సిద్ధం చేసే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలుమార్గాల్లో రైళ్ల రద్దీ పెరిగింది. అందుకే ఆయారూట్లలో అవసరమైన చోట మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. రైల్వే శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1960 కిలోమీటర్ల మేర.. కొత్త ప్రాజెక్టుల డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* అసలు రైలు మార్గం లేని..
రాష్ట్రవ్యాప్తంగా రైలు మార్గం లేని పదకొండు ప్రాంతాల్లో కొత్త లైన్లు వేయాలని భావిస్తోంది రైల్వే శాఖ( railway department). దీనికి గతంలోనే సర్వే నిర్వహించింది. అందుకే ఇప్పుడు డిపిఆర్ సిద్ధం చేస్తోంది. రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కొన్నిచోట్ల రైలు పట్టాల కోసం బైపాస్ లైన్లు వేస్తారు. రైల్వే లైన్ పై వంతెనలు కూడా నిర్మిస్తారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజధానులను కలుపుతూ హై స్పీడ్ క్యారీడర్ నిర్మిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, చెన్నైకు హై స్పీడ్ రైళ్లు నడపనున్నారు. హైదరాబాదు నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్కు సంబంధించి ఏపీలో 300 కిలోమీటర్లు.. హైదరాబాదు నుంచి చెన్నై హై స్పీడ్ కారిడార్ లో ఏపీలో 464 కిలోమీటర్లకు డిపిఆర్ ల పై ఫోకస్ పెట్టారు.
* పెరిగిన గూడ్స్ రైళ్ల రద్దీ..
ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా గూడ్స్ రైళ్లకు( goods trains ) గిరాకీ పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తులతోపాటు అన్ని రకాల వస్తువుల రవాణా ఇప్పుడు రైళ్ల ద్వారా జరుగుతోంది. అలాంటి డిమాండ్ ఉన్న మార్గాల్లో మూడు, నాలుగు లైన్లు వేస్తున్నారు. విశాఖలోని సింహాచలం నార్త్ నుంచి కొత్త వలస వరకు 5, ఆరో లైన్ నిర్మాణం కోసం డి పి ఆర్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ- విశాఖపట్నం- భువనేశ్వర్ మార్గంలో వస్తు రవాణా అధికంగా జరుగుతోంది. ఒడిస్సా నుంచి కొత్తవలస మీదుగా విశాఖకు బొగ్గు, ఖనిజాల రవాణా జరుగుతుంది. అందుకే విశాఖలోని సింహాచలం నార్త్ నుంచి కొత్త వలస వరకు 5, ఆరో లైన్ వేయడానికి డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు.
* కొత్త రైల్వే లైన్లు ఇవే..
కొత్త రైల్వే లైన్ల కు సంబంధించి.. ఒంగోలు- దానకొండ.. దూపాడు- బేతంచెర్ల… మచిలీపట్నం- నరసాపురం.. మచిలీపట్నం- రేపల్లె, బాపట్ల -రేపల్లె, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- చెన్నై, పాలసముద్రం- నారాయణపురం, కాచిగూడ- చిట్యాల- జగ్గయ్యపేట, కొండపల్లి- సత్తుపల్లి, కొత్తగూడెం -కిరండల్, కొత్తవలస -అనకాపల్లి, గుంతకల్లు బైపాస్, పేరేచర్ల- మంగళగిరి ప్రాజెక్టు పనులకు రైల్వే శాఖ శరవేగంగా పావులు కదుపుతోంది.