Cyber Scam: నేటి కాలంలో సహజ మరణాల వెనుక కూడా ఏదో ఒక దారుణం ఉంటున్నది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తున్నది. ఆ తర్వాత కటకటాల వెనక్కి నిందితులు వెళ్తున్నారు.. ఇటువంటి ఘటనలు కుటుంబ సభ్యుల్లో అంతులేని ఆవేదనను మిగులుచుతున్నాయి. పూడ్చలేని గుండె కోతను కలిగిస్తున్నాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఆమెకు 76 సంవత్సరాలు. విశ్రాంత వైద్యురాలు.. హైదరాబాదులోని మలక్పేట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు జరిపించారు. ఇటీవల ఆ వృద్ధురాలు ఫోన్ పరిశీలిస్తుండగా కుటుంబ సభ్యులకు దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు తెలిసాయి. మృతురాలు కొందరితో వీడియో కాల్ చేసినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి బ్యాంక్ ఖాతాలో నుంచి దశలవారీగా 6.6 లక్షలు బదిలీ అయినట్టు ఫోన్ లో ఉన్న మెసేజ్ ల ప్రకారం గుర్తించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారని.. వారి చేతిలో మోసపోయారని.. చివరికి ఆ మనోవేదనతో ఆమె గుండెపోటుతో చనిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మృతురాలి ఫోన్లో కాల్ డేటా.. నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు.. ఇవన్నీ కూడా పోలీసులు సేకరించారు. సైబర్ నేరగాళ్లు 6.6 లక్షలు కొల్లగొట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలిని సైబర్ నేరగాళ్లు బెదిరించారని.. ఆమెను రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేయడంతో ఒక్కసారిగా బెదిరిపోయారని.. అందువల్లే వారు చెప్పిన ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారని.. వారి చేతిలో మోసపోయానని అపరాధ భావంతో ఆ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయారని సైబర్ పోలీసులు గుర్తించారు. అయితే ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. గుండెపోటుతో సహజంగా చనిపోయిందనుకుంటున్న సందర్భంలో .. ఇలాంటి దారుణం వినాల్సి రావడం బాధాకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.