https://oktelugu.com/

Raghurama Krishnam Raju: రాజుల నియోజకవర్గంపై రఘురామ చూపు

పొత్తులో భాగంగా టిడిపికి మిగిలిన 141 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు రఘురామరాజుకు సీటు కేటాయిస్తుందనుకున్న బిజెపి హ్యాండిచ్చింది.

Written By: , Updated On : April 7, 2024 / 11:51 AM IST
Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju

Follow us on

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడినుంచి చేస్తారు? ఎమ్మెల్యే గానా? ఎంపీ గానా? అసలు ఆయనకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉందా? చంద్రబాబు సర్దుబాటు చేయగలరా? ఆ పరిస్థితి ఉందా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. రఘురామకృష్ణం రాజు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. బిజెపి టికెట్ కోసం చివరి వరకు వేచి చూసిన ఆయనకు.. అగ్రనేతలు షాక్ ఇచ్చారు. ఏపీ బీజేపీలో జరిగిన అంతర్గత వ్యవహారంలో పెద్దలు చేతులెత్తేశారు. రఘురామకృష్ణంరాజు ఆశిస్తున్న నరసాపురం స్థానంలో.. భూపతి రాజు శ్రీనివాస వర్మ కు సీటు కేటాయించారు. అయితే ఇన్ని రోజులు తమకోసం కృషిచేసిన రఘురామను విడిచిపెడితే.. అంతిమంగా జగన్ ది పై చేయి అవుతుందని చంద్రబాబు భావించారు. రఘురామరాజును టిడిపిలో చేర్పించారు. ఎక్కడో ఒకచోట సీటు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

పొత్తులో భాగంగా టిడిపికి మిగిలిన 141 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు రఘురామరాజుకు సీటు కేటాయిస్తుందనుకున్న బిజెపి హ్యాండిచ్చింది. జనసేన ఇప్పటికే కొన్ని సీట్లను త్యాగం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రఘురామ కోసం రంగంలోకి దిగారు. నరసాపురం ఎంపీ సీటును బిజెపి వదులుకుంటే.. దాని స్థానంలో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ చేశారు. కానీ బిజెపి పెద్దలనుంచి సానుకూలత రాలేదు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఉండి ఎమ్మెల్యే సీటును ఇచ్చేందుకు ఆలోచన చేశారు. అయితే ఉండిలో టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో మంతెన రామరాజు గెలుపొందారు. ఆయనను తప్పిస్తే సహకరించమని టిడిపి శ్రేణులు తేల్చి చెప్పాయి. అయితే తాజాగా రఘురామ మీడియా ముందుకు వచ్చారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు.

విజయనగరం పార్లమెంట్ స్థానానికి గత రెండు ఎన్నికల్లో పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అశోక్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో రెండోసారి పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వయోభారంతో తప్పుకున్నారు. ఆయన స్థానంలో బీసీ నేత అయిన కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజయనగరం రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారా? అందుకు కలిశెట్టి ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు కాపులు అధికం. అశోక్ గజపతిరాజు విషయంలో తూర్పు కాపులు సర్దుబాటు చేసుకున్నారు. మంచి వ్యక్తి కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు. కానీ ఇదే సీటుకు ఎక్కడో ఉన్న రఘురామకృష్ణం రాజును తెచ్చి పెడితే ఒప్పుకునే స్థితిలో తూర్పు కాపులు లేరు. అయితే చంద్రబాబు మాటను కలిశెట్టి ఒప్పుకుంటారు. కానీ ఆ సామాజిక వర్గం మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ బలవంతంగా రుద్దినా.. గెలుపు పై స్పష్టమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రఘురామ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.