Raghu Rama Krishnam Raju: టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎంపికయ్యారు.ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎంపికయ్యారు. ఆయన పేరుతో నిన్న మూడు సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. రఘురామరాజుకు పోటీగా ఇంకెవరు నామినేషన్లు వేయలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. నరసాపురానికి చెందిన రఘురామకృష్ణం రాజు తొలిసారిగా వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. కొద్ది రోజులకే ఆ పార్టీని విభేదించారు. అధినేత జగన్ వైఖరి పై విమర్శలు మొదలుపెట్టారు. రచ్చబండ పేరుతో తీవ్ర విమర్శలకు దిగడంతో జగన్ సర్కార్ ఆయన పై రాజ ద్రోహం కేసు పెట్టింది. హైదరాబాదు నుంచి సిఐడి పోలీసులు గుంటూరు తీసుకొచ్చి చిత్రహింసలు కూడా పెట్టారు. సుప్రీం కోర్టు వరకు ఆశ్రయించడంతో బెయిల్ లభించింది. వైసిపి సర్కార్కు వ్యతిరేకంగా ఉండడంతో ఐదేళ్లపాటు సొంత నియోజకవర్గానికి కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో కూటమికి దగ్గర అయిన రఘురామకృష్ణంరాజు బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దక్కకపోయేసరికి చివరి నిమిషంలో టిడిపిలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు.
* అసెంబ్లీకి డుమ్మా
వైసీపీకి ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా సీట్లు దక్కలేదు. వై నాట్ 175 అని నినాదం చేసినా.. ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే 40% ఓట్లు దక్కించుకున్న పార్టీగా.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ డిమాండ్ చేస్తూ వచ్చారు. అదే కారణం చెబుతూ అసెంబ్లీ సమావేశాలకు దూరమయ్యారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టమని తేల్చి చెప్పారు. దీనిపై పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది.
* టిడిపి నేతల ఎద్దేవా
అయితే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదని.. కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేయడం ప్రారంభించింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కావడంతో జగన్ అసలు అసెంబ్లీకి రావడానికి భయపడతారని చెప్పారు. ఈ విషయంలో చాలామంది 11 రూపాయలతో బెట్టింగ్ కడుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చూసి జగన్ మాట్లాడలేరని.. అందుకే సభకు రారని.. అందుకే కుంటి సాకులు చెప్పుకుంటున్నారని అన్నారు వంగలపూడి అనిత. అయితే గతంలో అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనప్పుడు.. సభలో విపక్ష పాత్ర పోషించాల్సిన జగన్ ముఖం చాటేశారు. అటు తరువాత అదే స్పీకర్ కు ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాశారు. వైసీపీలో ఉన్నప్పుడు దారుణంగా అవమానించిన రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. దీంతో శాసనసభ అంటేనే జగన్ లో ఒక రకమైన అభిప్రాయం కలుగుతోందని సెటైర్లు పడుతున్నాయి.