Lorry Driver Success : తిరుపతిలో లారీ డ్రైవర్ నుంచి 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఓనర్ గా.. ముంబైలో తెలుగువాడి ప్రస్థానం ఇది!

కొందరి జీవితాల్లో అదృష్టాలు ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుందంటారు. కానీ ఆ వ్యక్తి చేసిన కృషిని గుర్తించరు. అందుకు ఆయన ఎంతలా కష్టపడి ఉంటారో కూడా తెలుసుకోరు.

Written By: Dharma, Updated On : August 19, 2024 3:07 pm

Raghava Mani Raju Success story

Follow us on

Lorry Driver Success : నాలుగు దశాబ్దాల కిందట ఆయన ఒక సామాన్య లారీ డ్రైవర్. తాను కష్టపడిన మొత్తంతో ఒక లారీ కొనుగోలు చేసుకున్నాడు. తన కష్టాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగాడు. రవాణా రంగంలో విస్తరిస్తూ టిప్పర్లు, పొక్లైనేర్లను సమకూర్చుకున్నాడు. దినదినాభివృద్ధి చెందాడు. ఊరికి సర్పంచ్ కావడంతో పాటు వాణిజ్యనగరం ముంబైలో సొంత భవనంలో నాలుగు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఓ డ్రైవర్ మల్టీప్లెక్స్ ఓనర్ కావడం అసమాన్యం. అటువంటిది చేసి చూపించాడు. ఇందుకోసం నిరంతరం పరితపించాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించాడు. ఓ మనిషి తలచుకుంటే సక్సెస్ ఎలా సాధ్యం కాదోనని భావించాడు. అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు రాఘవ మణి రాజు. 45 ఏళ్ల కిందట ఒక లారీతో జీవనోపాధి కోసం తిరుపతి నుంచి ముంబాయి వెళ్ళాడు మణిరాజు. అక్కడ ఒక్క లారీ తోనే ఆయన ప్రస్థానం ఆగలేదు. క్రమేపి వాహన రంగంలో అడుగు పెట్టాడు. జెసిబి లు, ప్రోక్లైనర్లతో పాటు రవాణాకు సంబంధించి అన్ని వాహనాలు సమకూర్చుకున్నాడు. అదో వ్యాపారంగా భావించాడు. భారీగా విస్తరించాడు. ఇంతలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి.. నవీ ముంబైలో స్థలం కొనుగోలు చేశాడు. 2013లో సొంత భవనంలో నాలుగు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. అద్దె భవనాల్లో మరో ఏడు స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.తాజాగా వాటిని ప్రారంభించారు. కేవలం తెలుగు వాళ్ల థియేటర్లని సగర్వంగా చెప్పుకునేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్లు మణిరాజు చెబుతున్నారు.

* టిడిపి వీరాభిమాని
మణి రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. పార్టీ ఆవిర్భావం నుంచే అభిమానిస్తూ వచ్చారు. క్రియాశీలక కార్యకర్త కూడా. అటు తరువాత నేతగా మారారు. 2021 పంచాయతీ ఎన్నికల్లో తిరుపతి జిల్లా వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురం గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అది ఆయన స్వగ్రామం. అప్పట్లో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి పంచాయతీని నిలబెట్టుకోగలిగారు. పంచాయతీ అభివృద్ధిలో చెరగని ముద్రవేశారు. అందుకే పంచాయతీ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వై వి రాజేంద్రప్రసాద్ ను పిలిచి అతనితో మల్టీప్లెక్స్ ను ప్రారంభింప చేశారు.

* అదే గ్రామానికి సర్పంచ్ గా కూడా
ఒకప్పుడు ఒక లారీ డ్రైవర్ గా కెరీర్ ప్రారంభించిన మణి రాజు.. ఇప్పుడు అదే గ్రామానికి సర్పంచ్ గా ఎంపిక కావడం విశేషం. అయితే పంచాయతీ అభివృద్ధిలో మణి రాజు చూపుతున్న చొరవ అభినందనలు అందుకుంటుంది. గ్రామంలో పేద కుటుంబాల వారు మరణిస్తే 5000 రూపాయల సాయం అందిస్తున్నారు. అంత్యక్రియలకు గాను వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పిల్లలు సైతం సేవారంగంలోనే ఉన్నారు.

* తెలుగువారి కోసమే
తాను కేవలం తిరుపతి నుంచి ముంబై వెళ్ళినప్పుడు ఒక్క లారీ తోనే వెళ్లానని.. కానీ కాలం కలిసి వచ్చి ఆర్థికంగా బలోపేతం అయ్యానని మణి రాజు చెబుతున్నారు. ముంబాయిలో తెలుగువాళ్లు సగర్వంగా చెప్పుకునేందుకు తాను 11 స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఉన్న ఊరికి, కన్నవారికి మంచి పేరు తేవాలన్నదే తన అభిమతం అన్నారు. తన ఇద్దరు పిల్లలు సైతం సేవారంగంలో కొనసాగుతూ ఉండడం పై ఆనందం వ్యక్తం చేశారు.
.