Village Ward Secretariat: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే చాలా రకాల ప్రయత్నాలు చేసింది. సచివాలయ ఉద్యోగుల అంతర్ మండలాల బదిలీలను కూడా చేసింది. జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను నియమించనుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. సిబ్బందిలో జవాబు దారి తనం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
* ఉద్యోగుల సర్దుబాటు..
ముఖ్యంగా సచివాలయాల్లో( secretariats ) పనిచేస్తున్న 11 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను సర్దుబాటు చేయనుంది. అటు తరువాత వీరిపై ఉన్నతాధికారులను మూడు అంచెల్లో నియామకాలు చేపడతారు. తమ స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఒక్కో సచివాలయంలో 6 నుంచి 8 మంది ఉద్యోగులు ఉండేలా చూస్తారు. వీరిపై పర్యవేక్షణ కోసం జిల్లా, మునిసిపల్, మండల స్థాయిలో అధికారులను నియమిస్తారు. జిల్లా కేంద్రాల్లో శాశ్వత అధికారులను నియమిస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో మున్సిపల్ శాఖ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారులను డిప్యూటేషన్ పై నియమించనున్నారు.
* పర్యవేక్షణ అధికారులు లేక..
2019 అక్టోబర్ 2 న వైసీపీ( YSR Congress) ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. అయితే వీరిపై పర్యవేక్షణ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో పంచాయితీలపై సచివాలయాల భారాన్ని మోపింది. ఈ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురయ్యారు. తాము ఏ శాఖ అధికారి పర్యవేక్షణలో ఉంటామో వారికి తెలియలేదు. అందుకే సచివాలయ వ్యవస్థను సమూల మార్పులు తీసుకొచ్చి పర్యవేక్షణ అధికారులను నియమించే ప్రక్రియను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మండల స్థాయిలో సచివాలయాలపై పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోలను డిప్యూటీషన్ పై తీసుకుంటున్నారు. పంచాయితీ రాజ్ శాఖ ఈ అధికారులను సర్దుబాటు చేస్తోంది. సచివాలయాల శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగులను దేవాదాయ శాఖకు కేటాయించాలని కూడా నిర్ణయించారు. దేవాదాయ శాఖలో విలీనం చేసుకుని గ్రేడ్ 3 ఈవోలుగా పోస్టింగ్స్ ఇస్తారు. కమిషనర్ కార్యాలయంలోనూ సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని తీసుకుంటారు. వచ్చే నెల 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.