Tirumala Laddu Case: తిరుమల( Tirumala) లడ్డూ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ హయాంలో టీటీడీ అధ్యక్షుడిగా పని చేసిన వై వి సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. దాదాపు 12 రాష్ట్రాల్లో సిట్ దర్యాప్తు చేపట్టింది. అప్పటి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డిని సైతం విచారించింది. కీలక ఆధారాలను సేకరించగలిగింది.
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో లడ్డూ తయారీకి సంబంధించి.. నెయ్యిలో కల్తీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వారి నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణ కోసం ఏర్పాటు చేశారు. అయితే ఇందులో రాజకీయ కుట్ర ఉందని.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. గత కొద్ది నెలలుగా తిరుపతి కేంద్రంగా సిట్ దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు నివేదికను ఈరోజు కోర్టుకు సమర్పించనుంది. చార్జ్ షీట్ దాఖలు చేయనుంది. తదుపరి ఈ కేసులో అరెస్టులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
భారీగా కమిషన్లు..
నెయ్యి సరఫరా చేసే కంపెనీల నుంచి అప్పట్లో భారీగా కమీషన్లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొన్న ఆ మధ్యన అప్పన్న అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈయన వై వి సుబ్బారెడ్డి కి పిఏ అన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ద్వారానే నెయ్యి సరఫరా దారుల నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి అనేది సిట్ వాదన. ఆ దిశగా 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టింది ఈ బృందం. అయితే అప్పన్న ఎకౌంట్లో తో పాటు ఫోన్ పే ల ద్వారా ఈ కల్తీ నెయ్యి సొమ్ము అందినట్లు సమాచారం. అయితే ఈరోజు చార్జ్ సీట్ దాఖలు చేసే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయని అనుమానాలు లేకపోలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో?