Radhakrishna Jagan KCR: వార్తను వార్త లాగా రాయాలి. విశ్లేషణ విశ్లేషణ మాదిరిగానే చేయాలి. అందులో సొంత పైత్యం ఉండకూడదు. సొంత ఎజెండా అసలు ఉండకూడదు. అప్పుడే ఆ వార్తలను ప్రచురించే మీడియాకు.. విశ్లేషణ చేసే పాత్రికేయుడికి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సమాజం కూడా ప్రత్యేకంగా చూస్తుంది. అంతే తప్ప వార్త రాసే విధానంలో సొంతతనాన్ని చూపించడం .. విశ్లేషణ చేయడంలో సొంత భావజాలాన్ని ప్రదర్శిస్తే దానిని మీడియా అనరు. రాజకీయ పార్టీకి డబ్బా అని పిలుస్తారు. ఇప్పుడు తెలుగు నాట అలాంటి డబ్బాలే ఉన్నాయి. పాత్రికేయులు లేరు. పాత్రికేయ సంస్థలూ లేవు. ఏదో ఒక ముసుగు వేసుకొని రాజకీయ పార్టీకి వంత పాడటమే వాటి విధి అయిపోయింది. దీని గురించి ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా.. తాము శుద్ధ పూసలమని మీడియా యజమానులు చెప్పినా అవన్నీ గాలికి కొట్టుకుపోయే పేలపిండి లాంటివే.
Also Read: AP electricitybill refund: ఇంతకీ ఏంటి ఏపీలో ఈ కరెంట్ చార్జీల కిరికిరి!
తెలుగు మాట సుప్రసిద్ధ పాత్రికేయుడిగా పేరుపొందిన వేమూరి రాధాకృష్ణ తన సొంత పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయ అంశాలపై విశ్లేషణ చేస్తారు. ఆ విశ్లేషణలో తనకు అందిన సమాచారం ఆధారంగా సంపాదకీయం రాస్తారు. తాజాగా రాసిన కొత్త పలుకులో సంచలన విషయాలను పంచుకున్నారు వేమూరి రాధాకృష్ణ. ముఖ్యంగా తెలుగునాట తనను వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారని వేమూరి రాధాకృష్ణ ఆ సంపాదకీయంలో ప్రస్తావించారు. ఒకవేళ వేమూరి రాధాకృష్ణ రాసేవి నిష్పక్షపాతమైన వార్తలైతే.. మిగతా రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికీ టార్గెట్ అవ్వాలి కదా. వారిద్దరికీ టార్గెట్ కాలేదంటే వేమూరి రాధాకృష్ణ రాసేవి నిస్పక్షపాత వార్తలు ఎలా అవుతాయి. వేమూరి రాధాకృష్ణ ఎందుకు టార్గెట్ అయ్యాడో తను రాసిన రాతల ద్వారానే సమాధానం చెప్పాడు. అలాంటప్పుడు ఇంత చించుకోవడం దేనికి.. వాస్తవానికి కేసీఆర్, జగన్ అనేవారు రాజకీయ నాయకులు. వారి ప్రయోజనాల తగ్గట్టుగానే రాజకీయాలకు చేస్తారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆ మాటకొస్తే రేవంత్, బాబు కూడా తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తారు. రేవంత్, బాబు చేస్తే ఒక విధంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చేస్తే ఒక విధంగా చూడడాన్ని ఆర్కే మానేస్తే అన్నీ సక్రమంగానే కనిపిస్తాయి. ఇక్కడేదో జగన్, కెసిఆర్ సర్వ పరిత్యాగులు అని మేం చెప్పడం లేదు. మాకు ఆ అవసరం కూడా లేదు. కాకపోతే సీనియర్ పాత్రికేయుడుగా రాధాకృష్ణ విశ్లేషణ చేసినప్పుడు రెండువైపులా ఒకే కోణాన్ని స్పృశించి ఉంటే బాగుండేది. అలా కాకుండా విక్టిమ్ కార్డు ప్లే చేయడం రాధాకృష్ణకు అలవాటుగా మారింది.
గడచిన 15 సంవత్సరాలుగా కేసీఆర్, జగన్ మీడియా తనను టార్గెట్ చేసిందని వాపోయిన రాధాకృష్ణ.. తన పత్రికలో వారిని ఉద్దేశించి ఎలాంటి రాతలు రాశాడు? ఎలాంటి విశ్లేషణలు చేశాడు? అనే విషయాలను మాత్రం చెప్పలేకపోయాడు. ఈనాటికి భారత పాత్రికేయ చరిత్రలో పాలగుమ్మి సాయినాథ్ విలక్షణ పాత్రికేయుడిగా కొనసాగుతున్నారు.. వాస్తవానికి ఆయన ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్నో రాతలు రాశారు. ఎన్నో విశ్లేషణలు చేశారు. అయినప్పటికీ ఆయన మీద ఎవరూ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అక్కడి దాకా ఎందుకు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత గోయంకా పై నాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఏనాడూ రాజకీయ ప్రత్యర్థిగా గోయంకాను ఇందిరా గాంధీ ప్రకటించలేదు.. కానీ తనను రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్, జగన్ ప్రకటిస్తున్నారని రాధాకృష్ణ చెప్పడం విడ్డూరం. రాధాకృష్ణ గనుక నిష్పక్షపాతంగా రాతలు రాసి.. నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే వారు మాత్రం ఎందుకు రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారు.. రాధాకృష్ణ అలా చేయడం లేదు కాబట్టే కేసీఆర్, జగన్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: Sharmila Comments Chandrababu: రాజధాని ఎక్కడ ‘బాబు’.. షర్మిల సెటైర్ వైరల్
కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే మీడియాకు ఒక రాజకీయ లక్ష్యం ఉంది. జగన్ ఆధ్వర్యంలో నడిచే మీడియాకూ పొలిటికల్ గా ఒక టార్గెట్ ఉంది. అలాంటప్పుడు వారి మీడియా నుంచి ఎటువంటి వార్తలు వస్తాయో ప్రజలకు ఒక అవగాహన ఉంది. అందువల్లే కదా కేసీఆర్ మీడియా ఇప్పటికి తెలంగాణ ప్రజల మనసును ఆకట్టుకోలేకపోతోంది. అందువల్లే కదా జగన్ మీడియా నిష్పక్షపాతమైన సంస్థగా చెప్పుకోలేకపోతోంది. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు కదా.. రాధాకృష్ణ కూడా అలాంటివాడు కాదు కదా.. ఒక మీడియా అధినేతగా తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత రాధాకృష్ణ మీద ఉంది. తన పత్రిక ద్వారా నిష్పక్షపాతమైన వార్తలను ప్రచురించాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంది. అలాంటప్పుడు నిష్పక్షపాతను పక్కనపెట్టి.. ఏకపక్ష వాదాన్ని భుజాలకు ఎత్తుకుంటే ఇలానే హెచ్చరికలు వస్తుంటాయి. దానిని రాధాకృష్ణ మరో విధంగా రాయడం.. తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.. అంతకుమించిన అవివేకం.