PV Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. సస్పెన్షన్ లోనే ఉండగా ఆయన రిటైర్ అవుతున్నారు. అయితే నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అది అంత ఈజీ కాదు అని అర్థం అవుతోంది. ఎందుకంటే ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి చేశారన్న అభియోగాలపై కేసులు నడుస్తున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ఆ కేసుల విచారణ అలానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఏ రాజకీయ పార్టీలో చేరి మైక్ అందుకున్నా.. ఆయనకు కేసులు తప్పవని తేలిపోయింది.
* వ్యతిరేకంగా జీవీ హర్ష కుమార్ కుమారులు
దళిత అజెండాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నది సునీల్ కుమార్ ఆలోచనగా వార్తలు వచ్చాయి. అయితే సొంత సామాజిక వర్గం లోనే ఆయనపై వ్యతిరేక వర్గం భారీగా తయారయింది. భారీగా విదేశీ నిధులతో పాటు కొన్ని వర్గాల నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం జరిగింది అని.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయులు బయటకు తీశారు. సోషల్ మీడియా డొమైన్ లో పెట్టారు. అంబేద్కర్ మిషన్ ద్వారా లక్షలాదిమంది దళితులను సభ్యులుగా చూపుతూ ఆయన భారీ దందా చేశారు అనేది జీవి హర్ష కుమార్ కుమారుల వెర్షన్. పదవీ విరమణ చేసిన మరు క్షణం సొంత సామాజిక వర్గం నేతలు కచ్చితంగా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉంది.
* అధికారిక రక్షణ కరువు..
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా సునీల్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. కానీ వైసీపీ హయాంలో ఆయన రాజకీయ ప్రేరేపిత కేసులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టారు అనేది ఒక ఆరోపణ. అయితే ఇన్ని రోజులు సర్వీస్ లో ఉండడంతో ఆయనకు బ్యూరోక్రసి వ్యవస్థ రక్షణగా నిలిచేది. ఇకనుంచి ఆ పరిస్థితి కూడా ఉండదు. రాజకీయంగా కొంత రక్షణ రావచ్చు కానీ.. తన సర్వీస్ ప్రకారం ఆర్థిక రాయితీలు కూడా వర్తించవు. ఇలా అన్నింటా ముప్పేట దాడిని సునీల్ కుమార్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
