Daggubati Purandeswari: స్పీకర్ గా పురందేశ్వరి.. చంద్రబాబు అలా నరుక్కుని వచ్చారన్నమాట

2014లో సుమిత్ర మహాజన్, 2019లో ఓమ్ బిర్లా స్పీకర్లుగా వ్యవహరించారు. ఆ రెండు ఎన్నికల్లోను బిజెపి కి స్పష్టమైన మెజారిటీ లభించడంతో ఆ పార్టీ స్పీకర్ పదవి తీసుకుంది.

Written By: Dharma, Updated On : June 11, 2024 11:53 am

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: కేంద్ర క్యాబినెట్ కొలువుదీరింది. ఇక వాట్ నెక్స్ట్ అంటే స్పీకర్. ఆ పదవి కోసం టిడిపి గట్టిగానే పట్టుబడుతోంది. అటు జేడీయూ సైతం తమకే ఇవ్వాలని కోరుతోంది. అయితే బిజెపి మాత్రం మధ్యమార్గంగా పరిష్కార మార్గం చూపుతోంది. 1996లో సైతం కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమికి టిడిపి మద్దతు కీలకంగా మారింది. ఆ సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించారు. తన పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ జిఎంసి బాలయోగికి లోక్ సభ స్పీకర్ పీఠంలో కూర్చోబెట్టారు. మరోసారి అలానే చేయాలని చంద్రబాబు గట్టి ప్రయత్నంతో ఉన్నారు. కానీ స్పీకర్ పదవి వదులుకోవడానికి బిజెపి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పూర్తి మెజారిటీ లేనందున బిజెపి స్పీకర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

2014లో సుమిత్ర మహాజన్, 2019లో ఓమ్ బిర్లా స్పీకర్లుగా వ్యవహరించారు. ఆ రెండు ఎన్నికల్లోను బిజెపి కి స్పష్టమైన మెజారిటీ లభించడంతో ఆ పార్టీ స్పీకర్ పదవి తీసుకుంది. ఇప్పుడు ఎన్డీఏలో టిడిపి, జెడియు కీలకంగా మారడంతో పదవుల విషయంలో మిత్రపక్షాలకు సైతం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ ఇద్దరూ సీనియర్లే. స్పీకర్ ప్రాధాన్యత వారికి తెలియంది కాదు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్పీకర్ పదవికి మరింత బలం లభించింది. ఫిరాయింపులకు పాల్పడే సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్కు విశేష అధికారాలు ఉన్నాయి. అందుకే రాజకీయాలు ఎలా మారుతాయో బిజెపికి తెలియంది కాదు. అందుకే మంత్రి పదవులు వరకు ఓకే కానీ.. స్పీకర్ పదవి విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్టు బిజెపి వ్యవహరిస్తోంది.

అయితే చంద్రబాబు స్పీకర్ పదవికి పట్టుబడుతున్న అంశం వెనుక పెద్ద రాజకీయమే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ పదవి విడిచి పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారు. అందుకు బిజెపి అగ్ర నేతలు సమ్మతించడం లేదు. అవసరమైతే ఏపీకి స్పీకర్ పదవి ఇస్తాం కానీ.. బిజెపి ఎంపీ కి ఎంపిక చేస్తామని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికైన పురందేశ్వరి స్పీకర్ పదవికి సరిపోతారని.. ఎన్టీఆర్ కుటుంబానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని.. తెలుగుదేశం పార్టీ సిఫారసుతో ఆమెకు పదవి దక్కిందనే గౌరవం కలుగుతుందని ఎత్తుగడ వేసినట్లు సమాచారం. పురందేశ్వరి అయితే చంద్రబాబు సైతం టిడిపికి స్పీకర్ పదవి కావాలని పట్టు పట్టరని బిజెపి అగ్ర నేతలు స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రయత్నం వెనుక పురందేశ్వరికి స్పీకర్ పదవి అప్పగించాలన్న లక్ష్యం ఉందని టాక్ వినిపిస్తోంది. టిడిపికి ఇవ్వాలని పట్టుబడితే కనీసం పురందేశ్వరి కైనా ఛాన్స్ వస్తుందని.. అందులో భాగంగానే చంద్రబాబు టిడిపికి ఇవ్వాలని ప్రతిపాదించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే పురందరేశ్వరి కోసం పరోక్షంగా చంద్రబాబు ప్రయత్నించారన్నమాట.