India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో గెలుపు భారత జట్టు ముందు వాలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. రిషబ్ పంత్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. నసీం షా 3/21, రౌఫ్ 3/21, అమీర్ 2/23 అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ చేశారు..
120 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 రన్స్ మాత్రమే చేసింది.. బుమ్రా 3/14, హార్దిక్ పాండ్యా 2/24, అర్ష్ దీప్ సింగ్ 1/31, అక్షర్ పటేల్ 1/11 సత్తా చాటారు.. మహమ్మద్ రిజ్వాన్ 31 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో బుమ్రా బాబర్ అజాం, రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ వికెట్లను పడగొట్టి పాకిస్తాన్ జట్టును చావు దెబ్బ తీశాడు.. ఇక బ్యాటింగ్లో కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అవుతున్నప్పటికీ.. రిషబ్ పంత్ ఏమాత్రం తడబడలేదు. 31 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 42 పరుగులు చేసి.. ఆకట్టుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం భారత బౌలర్ల ప్రదర్శన పై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. విన్ ప్రిడిక్షన్ ఎనిమిది శాతంగా ఉన్నప్పటికీ మ్యాచ్ గెలవడం అంటే అంత సులభం కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆట తీరు ప్రపంచంలో ఒక భారత జట్టుకు మాత్రమే సాధ్యమని కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో భారత్ జట్టు సంబరాలు మిన్నంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని టీం మేనేజ్మెంట్ కొనియాడింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ ను మేనేజ్మెంట్ ప్రశంసలతో ముంచెత్తింది. హార్దిక్ పాండ్యా కీలక సమయాల్లో వికెట్లు తీశాడని, స్లిప్ లో సూర్య కుమార్ యాదవ్ అదిరిపోయే క్యాచ్ పట్టాడని కొనియాడింది..
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ప్రత్యేకంగా మెడల్ వేసి ప్రశంసించాడు. ” ఈరోజు మ్యాచ్ గెలిచిందంటే దానికి కారణం ఇతడే. కొన్ని సంవత్సరాల క్రితం అతడు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు బాధనిపించింది. నేను వెళ్లి అతడిని చూశాను. పరామర్శ మాటలు మాట్లాడుతుంటే.. అతడు ఏనాడైనా జట్టులోకి వస్తాడని స్పష్టం చేశాడు. ఈరోజు వచ్చాడు. తను ఏంటో నిరూపించుకున్నాడు.. ఈరోజు మ్యాచ్ గెలవడంలో తన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మెడల్ వేసేందుకు అతడు అన్ని విధాలా అర్హుడంటూ” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.. టీమిండియా సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.