Jagan Pulivendula ZPTC By Election: కంచుకోట.. ఏదైనా ఓ జిల్లాను.. ఓ నియోజకవర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటే దానిని కంచుకోట అంటారు. అయితే మారిన రాజకీయ ముఖచిత్రంతో కంచుకోట అనే మాటలు వినిపించవు. ఏపీకి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ తమ జిల్లాలను, నియోజకవర్గాలను కంచుకోటలుగా మార్చుకోలేకపోయారు. కానీ కడప జిల్లా విషయానికి వచ్చేసరికి అలా మార్చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). 1978లో తొలిసారిగా పులివెందుల నుంచి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది మొదలు ఇప్పటివరకు ఆ నియోజకవర్గం ఆ కుటుంబం చేతిలోనే ఉంది. అంతెందుకు 2019 వరకు కడప జిల్లా సైతం ఆ కుటుంబ కలుసన్నల్లోనే నడిచింది. అయితే 2024 ఎన్నికల్లో పూర్తిగా సీన్ మారింది. కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జడ్పిటిసి ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి పెను ప్రమాదం సంభవించింది. అయితే ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి తప్పిదమే.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
* స్థితప్రజ్ఞత ప్రదర్శించాల్సిందే..
రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. అయితే ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకుని విజయం వైపు అడుగులు వేస్తుంటారు ఎక్కువమంది. ఓటమికి మించిన మిత్రుడు, గెలుపునకు మించిన శత్రువు ఉండరు. అయితే ఆ రెండింటి మధ్య తేడాని పసిగట్టి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఓటమి ఎదురైన సమయంలో నిరాశ, నిస్పృహలు ఆవహించడం సాధారణం. అయితే వాటిని అధిగమించడంలో స్థితప్రజ్ఞత పాటించాలి. అలా పాటించిన నాయకుడు వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు( nara Chandrababu) . 2004లో ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. 2009లో సైతం అపజయం పలకరించింది. ఇక పార్టీ పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో.. తన స్థితప్రజ్ఞతతో 2014లో అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు. 2019లో ఘోర పరాజయం చవిచూశారు. అటు తరువాత కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయినా అనూహ్యంగా పుంజుకుని 2024లో అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు. ఈ మొత్తం ఎపిసోడ్లను తీసుకుంటే చంద్రబాబు సంయమనం, సహనం, చతురత స్పష్టంగా కనిపిస్తాయి.
* కవ్వింపు చర్యలతోనే..
కేవలం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) కవ్వింపు చర్యల పుణ్యమే జడ్పిటిసి ఉప ఎన్నికలు వచ్చాయి. 2022లో అక్కడ జడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఎన్నికలు నిర్వహించి ఉంటే ఏకగ్రీవం అయ్యేది. కానీ ఇప్పుడు ఇంకా పది నెలల పదవీకాలం ఉండగా ఎన్నికల నిర్వహణ వెనుక తెలుగుదేశం ప్రభుత్వం వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఆ సమయంలో జన సమీకరణ చేస్తున్నారు. బలప్రదర్శనకు దిగుతున్నారు. మళ్లీ బలం పెరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలోనే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించి జగన్ బలం పెరగలేదని చెప్పే ప్రయత్నం గా తెలుస్తోంది. అయితే దీనికోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది కూటమి ప్రభుత్వం.
* అప్పుడు చంద్రబాబు మాదిరిగానే.. పులివెందులలో( pulivendula) తెలుగుదేశం పార్టీ గెలుపు అసాధ్యం అని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనుకూల మీడియాలో హోరెత్తించింది. అనుకూల విశ్లేషకులతో ఎన్నెన్నో చెప్పుకొచ్చింది. కానీ కుప్పంలో తనకు ఎదురైన పరిణామాలు చంద్రబాబుకు తెలుసు. 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కుప్పంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి వై నాట్ కుప్పం అంటూ స్లోగన్ ప్రారంభించింది. చంద్రబాబును బాగా భయపెట్టింది కూడా. స్థానిక సంస్థల్లో ఓటమి ని పట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని వెంటాడారు. వేటాడినంత ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు పులివెందులలో అదే పరిస్థితి చూపించాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇందులో సక్సెస్ అయ్యారు కూడా. అందుకే కంచుకోట ఇప్పుడు చేజారుతుండడంతో జగన్మోహన్ రెడ్డిలో ప్రస్టేషన్ ప్రారంభం అయింది. అయితే గతంలో చంద్రబాబు కు ఇదే తరహా పరిణామం ఎదురైంది. దానిని తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే సమర్థత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం రాజకీయంగా బలహీనపడటం ఖాయం.