Vice Presidential Election 2025: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఎన్డీఏలో రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ తటస్థ వైఖరి అనుసరిస్తోంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లైన్ లో ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ గురించి కానీ.. బిజెపి గురించి కానీ పల్లెత్తు మాట అనడం లేదు. ఇంకోవైపు బిజెపి సహకారంతో గత ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉన్నాయంటూ జగన్ చెబుతున్నారు. అదే తరహా వాదనను రాహుల్ గాంధీ వినిపిస్తున్నారు. అయితే మిగతా రాష్ట్రాల గురించి ప్రస్తావించిన రాహుల్.. ఏపీ ప్రస్తావన తీసుకురావడం లేదన్నది జగన్ లో ఉన్న అనుమానం. ఇలాంటి అస్పష్ట విధానాలు కొనసాగుతున్న ఏపీ రాజకీయాల్లో.. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కీలకం కానున్నాయి.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
* సెప్టెంబర్ 9న ఎన్నికలు..
భారత ఉపరాష్ట్రపతి( Indian vice president) తన పదవికి రాజీనామా చేశారు. దానిని భారత ప్రభుత్వం ఆమోదించింది కూడా. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్ట్రోరల్ కాలేజ్ భారత ఉపరాష్ట్రపతి ఎన్నుకోనుంది. 750 ఓట్లు ఉండగా.. అందులో సగాని కంటే ఎక్కువ అంటే 430 ఓట్లు అవసరం. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది బలం ఉంది. అయితే ఏపీ ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉన్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారంతోనే అలా జరిగిందని అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రాహుల్ గాంధీ సైతం ఈవీఎంలపై పోరాటం చేస్తున్నారు. బిజెపి ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి బలపరిచిన నేతకు మద్దతు తెలుపుతుందా? లేకుంటే ఇండియా కూటమి బరిలో దించిన నేతకు సపోర్ట్ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
* అధికార పార్టీలకు అనుకూలంగానే..
కాంగ్రెస్( Congress) పార్టీని విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి ఎంపిక జరిగింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీని ద్వేషించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అదే పార్టీ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలుపుతూ ఓట్లు వేసింది. 2017లో ఎన్డీఏ అధికారంలోకి రాగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బిజెపి బలపరిచిన రామ్నాథ్ కోవింద్ కి వైసిపి మద్దతు తెలిపింది. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడుకు ఓటు వేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలపరిచిన ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతిగా జగదీప్ దంఖడ్ కు మద్దతు తెలిపింది. అయితే సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతుంది? అనేది హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
* ఇండియా కూటమి నుంచి బలమైన అభ్యర్థి..
ప్రస్తుతం బిజెపి( Bhartiya Janata Party) ప్రత్యర్థి పార్టీలు కసిగా ఉన్నాయి. దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు మానసికంగా సిద్ధపడుతున్నాయి. ఉపరాష్ట్రపతిగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నిర్ణయించుకున్నాయి. అయితే ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణ సంకటమే. ఇప్పుడు గాని బిజెపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపితే.. జాతీయస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒంటరి కావడం ఖాయం. పోనీ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపితే కేసులు తెరపైకి రావడం తథ్యం. దీంతో జగన్మోహన్ రెడ్డి కక్కలేక.. మింగలేక సతమతం అవుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.