Pulivendula Politics: ఉప ఎన్నికలు.. ఇవి ఎప్పుడొచ్చినా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం కూడా. అయితే పులివెందుల( pulivendula) లాంటి చోట ఈసారి జరుగుతుండడం కాస్త ఆలోచన రేకెత్తిస్తోంది. అయితే ఉప ఎన్నికలు అనేవి కొత్త కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. 2012లోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉప ఎన్నికలకు వెళ్లిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. అటువంటి సమయంలోనే ఆ పార్టీ బెదరలేదు. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అప్పట్లో అధికారపక్షంగా కాంగ్రెస్ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రెండింటినీ కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. అధికార పార్టీ బెదిరింపులు, ఆందోళనలకు ప్రజలు భయపడలేదు. స్వేచ్ఛగా ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఇప్పుడు అదే పులివెందులలో జరిగిన చిన్నపాటి ఎన్నికను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరిపోతోంది.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!
నాటి తెగువ ఏది?
2012లో యూపీఏ ప్రభుత్వం( UPA government) కేంద్రంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఆ సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగువను ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఆ తెగువ కనిపించడం లేదు. పైగా భయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 10,600 ఓట్లు ఉన్న పులివెందుల మండలంలో.. అందులో సగం ఓట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోలేదా? 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఓట్ల శాతాన్ని బట్టి అక్కడ ఆయనకు దక్కిన ఓట్లు 500 లోపే. కానీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతున్నట్టు? తప్పకుండా భయం ఉంటుంది. అధికార పార్టీ అంతులేని అధికార ప్రభావం చూపుతుంది. అయితే 2012లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేసిందిగా.. అప్పుడు వైసీపీ తగ్గలేదు కదా.. భారీ మెజారిటీతో గెలిచింది కదా.. ఇప్పుడెందుకు భయపడుతోంది అంటే.. కచ్చితంగా తగ్గిన బలాన్ని అంచనా వేసుకునే.. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.
ఆందోళనలో వైసీపీ నేతలు..
పులివెందుల మండలంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. లేకుంటే వైసిపి( YSR Congress party) నేతల ఆందోళనలు ఏమిటి? వారు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఏకంగా ఈ ఎన్నికను రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు విజయవాడలో ఉన్న ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు జరిపారు. తద్వారా అర్థమవుతోంది పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో ఇబ్బంది తప్పదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. దానిని నిజం చేస్తూ వైసీపీ నేతల తీరు ఉంది. ముందే ఓటమి సాకులు వెతుక్కుంటుందన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఎవ్వరూ దొరకలేదా? పవన్ కళ్యాణ్ మీద పడ్డావేంటి?
టిడిపి అభ్యర్థి ధీమా..
మరోవైపు టిడిపి అభ్యర్థి లతా రెడ్డి( TDP candidate Lata Reddy ) తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వెళ్లలేదని.. తన విజయం సునాయాసం అని ఆమె చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతల భయం.. టిడిపి అభ్యర్థి ధీమా వెరసి పులివెందుల ఫలితం పై స్పష్టత వచ్చినట్లు అయ్యింది.