YCP: ఆ ఇద్దరు సోదరులు రాజకీయంగా పదవీ విరమణ చేయనున్నారా? పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోనున్నారా? రాజకీయ వారసులను బరిలో దించునున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి అలంకరించారు ధర్మాన ప్రసాదరావు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ధర్మాన. 2009లో రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు. ఆయన క్యాబినెట్లో కీలక పోర్టు పోలియో దక్కించుకున్నారు ధర్మాన. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ధర్మాన ప్రసాదరావుకు బదులు ఆయన సోదరుడు కృష్ణదాస్ ను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్. మంత్రివర్గ విస్తరణలో కృష్ణ దాసుని తప్పించి ధర్మాన ప్రసాదరావును తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సోదరులు ఇద్దరు ఓడిపోయారు. అయితే వయోభారంతో ఇద్దరూ రాజకీయాలనుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తమ వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
* సుదీర్ఘ నేపథ్యం
ధర్మాన ప్రసాదరావు సీనియర్ రాజకీయ నాయకుడు. పంచాయితీ స్థాయి నుంచి రాజకీయ అరంగెట్రం చేసి తనకంటూ నిరూపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల ఎంపీపీగా వ్యవహరించారు. 1989లో తొలిసారిగా నరసన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. చిన్న వయసులోనే క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్ష పాత్రలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు ప్రసాదరావు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు.
* ధర్మాన కృష్ణ దాస్ సైతం
ధర్మాన ప్రసాదరావు స్వయానా సోదరుడు కృష్ణదాస్. ఆయన కోసం 2004లో సొంత నియోజకవర్గం నరసన్నపేట ను వదులుకున్నారు ధర్మాన ప్రసాదరావు. తాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాను గెలవడమే కాకుండా సోదరుడు కృష్ణదాస్ ను కూడా గెలిపించుకున్నారు ప్రసాదరావు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆయన అడుగుజాడల్లో నడిచారు ఇద్దరు సోదరులు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు కృష్ణదాస్. కానీ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఇద్దరు సోదరులు ఓడిపోయారు. 2019లో ఇద్దరూ గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం వారసులను బరిలో దించాలని చూశారు. కానీ జగన్ అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం వారసులను బరిలో దించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. జగన్ సైతం అంగీకారం తెలపడంతో ఇద్దరు వారసులను యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.