Adari Anand Kumar: ఏపీలో కూటమి దూకుడు మీద ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా చేరికల విషయంలో కూటమి ప్రణాళిక అదుర్స్. నేరుగా టిడిపిలో చేరిన వారు ఉన్నారు. జనసేన బలోపేతం కావాల్సిన ప్రాంతాల్లో వైసిపి నేతలను తీసుకుంటున్నారు. వ్యాపారం, వాణిజ్యం సర్దుబాటు చేయాల్సిన నేతలు మాత్రం బిజెపిలో చేరుతున్నారు. అయితే ఈ చేరికల అంశం ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అడారి ఆనంద్ కుమార్ బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి తులసిరావు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. నందమూరి తారక రామారావు తో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. 2019 ఎన్నికల వరకు ఆ కుటుంబం తెలుగుదేశం లోనే ఉంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అడారి ఆనంద్ కుమార్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ విశాఖ డెయిరీ పై ఉక్కు పాదం మోపింది. దీంతో ఆనంద్ కుమార్ వైసీపీలో చేరాల్సి వచ్చింది. తండ్రి తులసి రావు అకాల మరణంతో ఆయనకు ఏం చేయాలో పాలు పోలేదు. వైసీపీలో కొనసాగిన ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. కానీ ఓటమి ఎదురయింది. దీంతో టిడిపి కూటమి ప్రభుత్వానికి ఆయన టార్గెట్ కావాల్సి వచ్చింది.
* టిడిపిలోనే సుదీర్ఘకాలం
అడారి కుటుంబం సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కుటుంబ పరిస్థితి తీసికట్టుగా మారింది. విశాఖ డెయిరీ మూలంగా అధికార పార్టీగా ఉన్న వైసీపీకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. కానీ ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో తిరిగి టిడిపిలోకి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అడారి తులసిరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. ఆ కుటుంబాన్ని సేఫ్ జోన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆనంద్ కుమార్ తో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు. తమ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
* టిడిపి శ్రేణుల అభ్యంతరాలతో..
వాస్తవానికి అడారి తులసిరావుకు సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఓ రెండు మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తి ఉంది. పైగా ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో మంచి అనుబంధము ఉండడంతో ఉత్తరాంధ్రలో తులసిరావు పట్ల టిడిపి శ్రేణులకు ఎనలేని గౌరవం ఉంటూ వచ్చింది. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తులసిరావు నేతృత్వంలోనే విశాఖ డైరీ ని ఇబ్బంది పెట్టారు. కానీ తులసి రావు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలేదు. అదే నమ్మకంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అడారి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఏకంగా అనకాపల్లి పార్లమెంట్ సీటును ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయేసరికి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరారు. అదే టిడిపి శ్రేణులకు ఇష్టపడని విషయం. ఇప్పుడు అదే ఆనందకుమార్ టిడిపిలో చేరతారని అంతా భావించారు. కానీ టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు కలుగజేసుకుని ఆనందకుమార్ ను బిజెపిలో చేరాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి అయితే తన స్నేహితుడి కుమారుడ్ని అలా సెట్ చేసారన్నమాట.