AP Free Bus:కూటమి సర్కార్ దూకుడు మీద ఉంది. ఎన్నికల హామీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వీలైనంతవరకు అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనిపై రవాణా శాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం దీనిపై సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అధ్యయనానికి ఇద్దరు మహిళా మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అతి త్వరలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి పథకం అమలు కానుందని తెలుస్తోంది.
* సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా
ఈ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు చంద్రబాబు. అందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం కర్ణాటక తో పాటు తెలంగాణలో అమలవుతోంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. దీంతో అక్కడి మహిళలు విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అలాగే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఇదే హామీ ఇచ్చింది. అక్కడ కూడా మహిళలు ఆదరించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ పథకం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ఈ కీలక హామీ ఇచ్చింది. ఇక్కడ కూడా మహిళలు ఆదరించారు. దీంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
* సంక్రాంతి నాటికి
సంక్రాంతి నాటికి ఈ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కర్ణాటక తో పాటు తెలంగాణలో ఈ పథకం అమలవుతుండడంతో అక్కడ అధ్యయనానికి కమిటీ వెళ్ళనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చాక ఈ పథకం కసరత్తుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అధికారులతో కూడిన బృందం ఒకటి ఈ పథకం పై అధ్యయనం చేసింది. అయితే ఈ పథకాన్ని పల్లె వెలుగు సర్వీస్ లకు పరిమితం చెయ్యాలా? లేకుంటే ఎక్స్ప్రెస్, అంతకుమించి సర్వీసులకు పరిమితం చెయ్యాలా? అని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.అయితే కొద్ది రోజుల్లోనే ఈ అధ్యయనం చేసి ఈ ముగ్గురు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఎలాగైనా ఈ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.