Pradhan Mantri Matru Vandana Yojana: సుఖప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం సైతం దీనిపై ఫోకస్ పెట్టింది. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖకు మార్చింది. ఈ పథకం ద్వారా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించనుంది. 11వేల రూపాయల వరకు సాయం అందించేందుకు నిర్ణయించింది. మాతా శిశు మరణాలను నియంత్రించేందుకుగాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో పకడ్బందీగా పథకం అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది కూటమి ప్రభుత్వం.
పౌష్టికాహారంతో పాటు టీకాలు..
సాధారణంగా నిరుపేద కుటుంబాల్లో గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఆపై ప్రసవం తర్వాత చిన్నారులకు టీకాలు సకాలంలో వేయించడం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు 11వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతోంది. ఈ డబ్బులతో పిల్లలకు పోషకాహారం సైతం అందించవచ్చు. టీకాలు సైతం వేయించవచ్చు. ప్రస్తుతం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం నిర్వహణను వైద్య ఆరోగ్యశాఖ చూసేది. ఇకపై నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ చూడనుంది.
Also Read: టిడిపి వర్సెస్ తారక్.. వైసిపి కోరుకుంటోంది అదే!
స్పెషల్ లాగిన్..
ఈ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఒక స్పెషల్ లాగిన్ కేటాయించారు. లబ్ధిదారులు అంగన్వాడి కేంద్రానికి వెళ్తే వివరాలు నమోదు చేస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ప్రసవానికి ముందు నెలకు రూ.1000… ప్రసవం తరువాత రూ.2000 అందించనున్నారు. ప్రసవం అనంతరం బిడ్డకు ఏడాదిలో టీకాలు వేయించడం పూర్తయ్యాక మరో రెండు వేలు తల్లుల బ్యాంక్ అకౌంట్కు నేరుగా జమ చేస్తారు. అదే రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే 2000 చొప్పున 3 విడతల్లో జమ చేస్తారు. రెండు కాన్పుల్లో కొడుకు, కూతురు జన్మిస్తే 11 వేల వరకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. గర్భిణీలు దగ్గర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం.