TDP vs Jr NTR: జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) వర్సెస్ కూటమి అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు కొందరు నేతలు. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత ఆజ్యం పోస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఆడియో వైరల్ గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్లో జరిపిన సంభాషణ లీక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో అనంతపురం ఉద్రిక్తంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కు టిడిపి అగ్రనాయకత్వం పెద్దగా సహకరించడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ సినిమా విడుదల అయింది. ఆ సినిమా ప్రదర్శన విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అయితే ఆడియో లీక్ కావడంతో.. అది తన వాయిస్ కాదని.. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులు చేసిన పని అంటూ ఎమ్మెల్యే ప్రసాద్ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గలేదు. అనంతపురంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం విశేషం.
టిడిపి శ్రేణుల్లో భిన్నాభిప్రాయం..
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party ) ఒక భిన్న అభిప్రాయం ఉంది. మొన్నటి ఎన్నికల ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరి వారిగా భావించే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ వ్యవహరించిన తీరు.. వారి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నియంత్రించలేకపోవడం.. చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవడం.. నారా భువనేశ్వరి పై వైసీపీ నేతల వ్యాఖ్యలను సరైన రీతిలో ఖండించకపోవడం.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం సరైన రీతిలో కామెంట్స్ చేయకపోవడం వంటి కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ పై టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన భిన్న అభిప్రాయం ఏర్పడింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేష్ హవా పెరిగింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో ఆయన పట్టు సాధిస్తూ వచ్చారు. అయితే లోకేష్ కు దగ్గర కావాలన్నా ఆలోచనతో ఉన్న నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అందులో భాగమే అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాలకు దూరంగా..
అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా( pan India ) స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. దానిని రక్షించుకునే పనిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎటువంటి రాజకీయ వేదికలపై కానీ.. ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం లేదు. వివాదాస్పదం అయ్యే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సొంత సోదరి ఎన్నికల్లో పోటీ చేసినా ఎటువంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఎన్టీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు లేవు. జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు లేవని.. మంచి సంబంధాలే ఉన్నాయని లోకేష్ చెబుతుంటారు. చాలా సందర్భాల్లో లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. శుభాకాంక్షలు చెప్పుకున్న సందర్భాలు కూడా అధికం.
Also Read: ఏపీలో ఆ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం!
ఫ్యాన్స్ ముసుగులో వైసిపి..
అయితే టిడిపి ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. సినిమా ప్రదర్శన విషయంలో ఆయన మాటలు.. తెలుగుదేశం పార్టీ మాటలు గానే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. తారక్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. సందట్లో సడే మియా అన్నట్టు వైసీపీ నేతలు ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. అరచేతిలో సూర్యుడిని ఆపలేరు అన్నట్టే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోలేరని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ నేతలు ఉన్నారని.. ఇటువంటి సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. లేకుంటే టీడీపీ నాయకత్వానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరగాలని కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇప్పుడు ఆ పార్టీ చేస్తోంది అదే. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ కు నష్టం జరుగుతుంది. అంతకుమించి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.