AP Post Office : సాధారణంగా పోస్టాఫీస్ లకు ఆదరణ తగ్గింది. ఒక్క హెడ్ పోస్టాఫీసులు తప్ప.. మిగతా వాటిలో పెద్దగా లావాదేవీలు కనిపించవు. జనాలు కూడా ఉండరు. అటువంటిది గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీస్ లు జనాలతో కళకళలాడుతున్నాయి. రోజురోజుకీ జనం తాకిడి పెరుగుతోంది. చాలామంది కొత్త ఖాతాలు తెరిచేందుకు క్యూ కడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని ఈ వాతావరణానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సంకేతమే. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాల అమలు ప్రారంభం అయ్యింది. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలవుతున్నాయి. మిగతా పథకాలు సైతం వీలైనంత త్వరగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు, ఆధార్ లింకు కాని వారు పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవాలని ఓ సంకేతం వచ్చింది. దీంతో లక్షలాది మంది జనం పోస్ట్ ఆఫీస్ ల చుట్టూ తిరగడం ప్రారంభించారు. అయితే ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు ఉన్నవారు సైతం ఎగబడుతుండడం విశేషం.
* తగ్గిన ఆదరణ
ఇదివరకు మాదిరిగా పోస్ట్ ఆఫీసులకు ఆదరణ తగ్గింది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా తగ్గాయి. ఇప్పుడంతా నెట్ బ్యాంకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో పోస్ట్ ఆఫీస్ లో వైపు చూడడం మానేశారు ప్రజలు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రచారంతో ఎక్కువమంది పోస్ట్ ఆఫీస్ వైపు పరుగులు తీస్తున్నారు. వాస్తవానికి బ్యాంకులో అకౌంట్ లేనివారు, ఉండి కూడా ఆధార్ తో లింకు కాని వారు మాత్రమే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉన్నవారు వాటికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తో లింక్ కాకపోతే.. అటువంటివారు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి లింక్ చేసుకోవాలి. కానీ ఇవేం తెలియని చాలామంది ఎక్కడ సంక్షేమ పథకాలుకోల్పోతామని భావించి పోస్ట్ ఆఫీస్ వైపు పరుగులు తీస్తున్నారు.
*అవగాహన ఏది?
అయితే ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన సచివాలయ సిబ్బంది తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆధార్ లింక్ కాని వారి వివరాలను సేకరించి పంపిస్తున్నారు. అయితే అసలు విషయం తెలియని చాలామంది అనవసరంగా పోస్ట్ ఆఫీస్ లకు వెళ్తున్నారు. ఆధార్ లింకు ఎందుకు? అలా ఎందుకు చేయాలి? చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి? అనే అంశాలను గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తే పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే సచివాలయ సిబ్బంది ఆధార్ లింక్ కోసం పంపిస్తుండటంతో.. ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లకు వెళ్తున్నారు. దీంతో పోస్ట్ ఆఫీసులు రద్దీగా మారుతున్నాయి.