Dharmana Krishna Das PA: ఆయన వైద్య ఆరోగ్యశాఖలో చిరుద్యోగి. అయితేనేం దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అర్జించారు. నెలకు పరిమిత వేతనంతో అది ఎలా సాధ్యం అనుకున్నారా? అంటే చిరుద్యోగిగా ఉంటూ మంత్రికి పీఏగా పనిచేశారు. ఇంకేముంది తాను అనుకున్నది సాధించారు. స్వల్ప కాలంలోనే 100 కోట్ల వరకు వెనకేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణ దాసు వైసీపీ హయాంలో మంత్రి. ఆపై డిప్యూటీ సీఎం కూడా. ఆయన వద్ద పీఏగా పనిచేసిన గొండు మురళి తాజాగా ఏసీబీకి చిక్కారు. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అక్రమార్జన చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ తన క్యాబినెట్ లోకి ధర్మాన కృష్ణ దాస్ ను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. అప్పట్లో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే మురళిని తన పీఏ గా పెట్టుకున్నారు. కానీ గత ఐదేళ్లుగా మురళి బాగా ఆస్తులు గడించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఏకకాలంలో మురళి ఇంటితోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది.
* ఏకకాలంలో దాడులు
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా ఉన్న మురళి సొంత గ్రామం జలుమూరు మండలం లింగన్నాయుడు పేట. ప్రస్తుతం కోటబొమ్మాలి మండలం దంతలోని తన అత్తవారి ఇంట స్థిరపడ్డారు. ప్రస్తుతం సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.20 ఎకరాలకు పైగా భూమి,విశాఖ, శ్రీకాకుళం తో సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిలో బంగారు ఆభరణాలు, 11 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి మార్కెట్ ధర 100 కోట్లు వరకు ఉంటుందని అంచనా. మురళిని అదుపులోకి తీసుకుని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
* గతం నుంచి అవినీతి ఆరోపణలు
ధర్మాన కృష్ణ దాస్ పీఏగా చేరకముందు మురళి సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహించారు. గతం నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఫిర్యాదులు పెరిగినట్లు తెలుస్తోంది. అక్రమాస్తులు పెద్దగా కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయితే ఒక చిరుద్యోగి 100 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడడం వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అప్పటి మంత్రికి ఈయన బినామీ అన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.