Posani Krishna Murali
Posani Krishna Murali: ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఆయన ఉండగా.. పోలీసులు ఆయన ప్లాట్ కు వెళ్లి అరెస్టు చేశారు.. ఆయనను విజయవాడ తీసుకెళ్లారు.. గురువారం న్యాయమూర్తి ఎదుట ఆయనను హాజరు పరిచి.. వైద్య పరీక్షల అనంతరం విచారణ ఖైదీగా జైలుకు పంపించే అవకాశం ఉంది.
Also Read: ఆ ఒక్క ట్వీట్ ఆ నేత కొంప ముంచనుందా?
అరెస్టుకు ముందు కృష్ణ మురళికి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వాగ్వాదం జరిగింది.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది..” నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ వెళ్లి పరీక్షలు చేయించుకుని.. మీకు సహకరిస్తాను. అప్పటిదాకా మీరు వెళ్లిపోండి” అని కృష్ణ మురళి పోలీసులకు విజ్ఞప్తి చేయగా..” సార్.. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మాకు అనుమతులు ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించిన పత్రాలు మీరు చూడండి. ఫిర్యాదు వస్తే.. మాకు సరైన ఆధారాలు లభిస్తే.. ఎక్కడికి వెళ్లినా..ఎక్కడ ఉన్నా అరెస్టు చేసే అధికారం మాకు ఉంటుందని” పోలీసులు ఆయనకు వివరించారు. ఇక ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని తమ ఫోన్లలో వీడియో తీశారు. వీడియో తీస్తుండగా పోలీసులు వారిని వారించారు. ఆ తర్వాత పోసాని కృష్ణ మురళిని పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేయడానికి ముందు పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో వాగ్వాదం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.. పోలీసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని సమాచారం. ” మీరు ఎవరో నాకు తెలియదు. నా ఇంటికి ఎందుకు వచ్చారో కూడా తెలియదు.. మీతో నేను ఎందుకు రావాలి” అని కృష్ణ మురళి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. కృష్ణ మురళి వ్యవహార శైలి నేపథ్యంలో పోలీసులు అతికష్టం మీద ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ” పోసాని కృష్ణ మురళి మాతో గొడవ పెట్టుకోవాలని చూశారు. మేము నోటీసులు ఇస్తున్నప్పటికీ.. తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. మా ఇంట్లోకి మీరు ఎలా వస్తారు.. అసలు మిమ్మల్ని లోపలికి ఎవడు రానిచ్చాడు.. ఇంకా రాయడానికి వీలు లేని భాషలో ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని” ఏపీ పోలీసులు చెబుతున్నారు.
పోసాని భార్య ఏమంటున్నారంటే..
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై ఆయన భార్య స్పందించారు. ” పోలీసులు బుధవారం రాత్రి మా ఇంటికి వచ్చారు. గందరగోళం సృష్టించారు. అన్నం కూడా తిననివ్వలేదు. ఆయన హాస్పిటల్ వెళ్తానని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఆయన వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ విషయం చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వినిపించుకోలేదని” పోసాని భార్య వాపోయారు.. అయితే అరెస్టు సమయంలో మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో హాయ్ డ్రామా చోటు చేసుకుందామని తెలుస్తోంది. అయితే తమకు అందిన ఫిర్యాదుతోనే.. ఆధారాలు అందిన తర్వాతే ఆయనను అరెస్టు చేశామని ఓబులవారిపల్లె పోలీసులు చెబుతున్నారు. వైసీపీ హయంలో ఏపీ ఎఫ్డివిడిసి చైర్మన్ గా పోసాని కృష్ణమురళి పనిచేశారు. ఆయన వైసిపికి అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడ్డారు. ఆ తర్వాత నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని.. అందువల్లే ఆయనపై ఫిర్యాదులు అందాయని ఓబులవారిపల్లె పోలీసులు చెబుతున్నారు. అందువల్లే ఆయనను అరెస్ట్ చేసామని వివరిస్తున్నారు. గురువారం ఉదయం పోసాని కృష్ణమురళిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.