Posani Krishna Murali : వల్లభనేని వంశీ అరెస్టును మర్చిపోకముందే వైసిపికి కూటమి ప్రభుత్వం మరో షాకిచ్చింది.. ఈసారి ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఉంటున్నారు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన తర్వాత ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. గతంలో మాదిరిగా విమర్శలు చేయడం లేదు.. సాక్షి టీవీలో కూడా కనిపించడం లేదు.. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కృష్ణ మురళి ఫేడ్ అవుట్ అయిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతలోనే ఆయన అరెస్టు సంచలనంగా మారింది.
అందువల్లే అరెస్ట్ చేశారా
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. పోసాని కృష్ణ మురళి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేవారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేసేవారు. ఎన్నికలకు ముందు సాక్షి టీవీలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి కనిపించేవారు. తనదైన శైలిలో టిడిపి మీద ఆయన విమర్శలు చేసేవారు. అప్పట్లో నారా లోకేష్, చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలపై టిడిపి నాయకులు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో.. నాడు టిడిపి నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నారు. వాటిని ప్రస్తావిస్తూ పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల వల్లభనేని వంశీని కూడా రాయదుర్గం ప్రాంతంలోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకెళ్లి.. ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరిచారు. ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం వల్లభనేని వంశీ ప్రస్తుతం విచారణ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని కూడా పోలీసులు విజయవాడకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు మేనమామ అవుతారు.. కృష్ణ మురళి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే భద్రత చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కృష్ణ మురళిని విజయవాడకు తీసుకెళ్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి.. వైద్య పరీక్షల అనంతరం కృష్ణ మురళిని ఏపీ పోలీసులు జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.
Also Read : సిట్ ఏర్పాటు.. కబ్జాలపై ఫిర్యాదులు.. వల్లభనేని వంశీకి ఈజీ కాదు