Ponnavolu Sudhakar Reddy: వారంతా సుప్రీంకోర్టు( Supreme Court) న్యాయవాదులు.. పేరు మోసిన కేసులను సైతం ఇట్టే డీల్ చేయగలరు. అటువంటి వారికి సవాల్ విసిరారు ఏపీకి చెందిన వైసిపి ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైసిపి హయాంలో ప్రభుత్వ వకీలుగా ఉండేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పొన్నవోలు హీరోగా మారిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడమే కాదు.. జాతీయస్థాయిలో సైతం ప్రెస్ మీట్ లు పెట్టి రాజకీయ నాయకుడి మాదిరిగా ప్రసంగాలు కూడా చేసేవారు. 2024 ఎన్నికల కు ముందు లండన్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రం ఏమై పోతుంది అని రోదించారు. అయితే వైసిపి హయాంలో ప్రభుత్వ వకీలుగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఆ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత మాత్రం ఇప్పుడు పార్టీ లీగల్ టీంకు హెడ్ గా మారిపోయారు.
గత 17 నెలల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ నేతల పై నమోదైన కేసుల విషయంలో కొన్ని రకాల విషయాలను చర్చించుకోవాలి. ఓ స్థాయి కలిగిన నేతలు కేసుల విషయంలో నిరంజన్ రెడ్డి లాంటి లాయర్ వస్తున్నారు. అదే మీడియం స్థాయి నేతలు విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి డీల్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి స్థాయి వాదనలు వినిపించిన తర్వాత అనుకూల తీర్పులు, ఆదేశాలు వస్తున్నాయి. అది పొన్నవోలు వాదించిన కేసుల్లో మాత్రం ప్రతికూల తీర్పులు వస్తున్నాయి. సాధారణ అవినీతి కేసులో చిక్కిన మాజీ ఐపీఎస్ సంజయ్ కుమార్ ఇప్పుడు బెయిల్ రాకుండా లోపల ఉన్నారు. దానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం ఉంది.
తాజాగా కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు మాజీమంత్రి జోగి రమేష్( Jogi Ramesh ). ఆయన కేసును సైతం పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే రిమాండ్ కు వెళ్లిపోయారు జోగి రమేష్. దీంతో ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదని తేలిపోయింది పొన్నవోలు వాదనల ద్వారా. వైసీపీలో ఎవరినైనా బలిపశువు చేసి పార్టీ నాయకత్వం లబ్ధి పొందాలంటే పొన్నవోలు రావాల్సిందేనన్న కామెంట్ ఉంది. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయవాదులను ఢీకొట్టారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నాకంటే మీరు తెలివైనవారా అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ వాదనలు ముఖ్యం కాదు. అప్పట్లో ప్రభుత్వ వకీలుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా విచ్చలవిడిగా వ్యవహరించారు పొన్నవోలు. ఇప్పుడు మాత్రం అలా కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.