Anchor Shyamala: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో పని చేసిన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పార్టీకి దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురైన తరువాత సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. ఎన్నికలకు ముందే వైసిపి తో తనకు సంబంధం లేదన్నట్టు స్వచ్ఛందంగా తప్పుకున్నారు మంచు మోహన్ బాబు. అయితే నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మాత్రం కాస్త యాక్టివ్గానే ఉండేవారు. వైసీపీలో క్రియాశీలకంగా పని చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వైసీపీ హయాంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కు సంబంధించి కేసు మెడకు చుట్టుకుంది. చాలా రోజులు పాటు పోసాని జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యం పై కూడా చూపింది. దీంతో వైసీపీలో క్రియాశీలకంగా ఉండడాన్ని తగ్గించేశారు పోసాని. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి ఉన్నది కేవలం మాజీ మంత్రి రోజా మాత్రమే. అయితే తాజాగా ఆమెకు సినీ యాంకర్ శ్యామల తోడైంది. ప్రస్తుతం ఆమె సైతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
* అనవసర ఆరోపణలు..
మొన్న ఆ మధ్యన కర్నూలు( Kurnool ) బస్సు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారానికి దిగింది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్ర వాహనదారుడు ఇందుకు కారణం అని తేలింది. అయితే సదరు యువకుడు బెల్ట్ షాపులో నకిలీ మద్యం తాగడం వల్లే ఆ ఘటనకు కారణమయ్యాడని యాంకర్ శ్యామల ఆరోపించారు. అయితే సదరు యువకుడు మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. కేవలం ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకే శ్యామల ఆతరహా ఆరోపణలు చేసినట్టు తేలింది. దీంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్ననే పోలీస్ స్టేషన్కు వెళ్లారు శ్యామల. వెంట కర్నూలు వైసీపీ నేతలు ఉన్నారు.
* ఒక్కొక్కరూ పార్టీకి గుడ్ బై..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆ పార్టీకి క్రమేపి దూరమయ్యారు. కమెడియన్ అలీ( comedian Ali) లాంటి వ్యక్తులు సినీ పరిశ్రమలో ఇబ్బంది పడినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు సినీ పరిశ్రమలో ఉండడంతో నిలదొక్కుకున్నారు. మోహన్ బాబు సైతం ఏ పార్టీతో కలవకుండా తన పని తాను చేసుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధపడ్డారు. కానీ యాంకర్ శ్యామల మాత్రం తిరిగి బుల్లితెరపై కనిపించడమే మానేశారు. అయితే ఆమె రాజకీయాలు చేసిన తర్వాత వృత్తిపరంగా పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే నెలకు 3 లక్షల రూపాయల వేతనంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయారు అన్న వార్తలు వచ్చాయి. కానీ బుల్లితెరపై యాంకరింగ్ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.