Lok Sabha Election 2024: ఎన్నికల్లో ప్రచారం కీలకము. ప్రజలను తమ వైపు తిప్పుకోవడం అత్యంత ఆవశ్యకం. ఇటువంటి తరుణంలో చిన్న మాట దొర్లినా ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పవు. అందుకే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వీలైనంతవరకు ఆచితూచి మాట్లాడడం చేయాలి. అసలే సోషల్ మీడియా రాజ్యమేలుతున్న తరుణంలో ఏ చిన్న తప్పు చేసినా అడ్డంగా బుక్ కావాల్సిందే. కొద్దిపాటి నోరు జారినా అది వివాదాస్పదంగా మారక మానదు. ప్రతికూలత చూపుతుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. కానీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కవ్వింపు చర్యలకు దిగడం, పరస్పర దాడులు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ప్రతి పార్టీలో వివాదాస్పదులు ఉండడం సర్వసాధారణం. ఇటువంటి వారితో ఇటీవల ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటువంటి వారిని నియంత్రించకపోతే పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలను దూరం చేసుకోక తప్పదు. చాలామంది నేతలు తమకు ఇష్టా రీతిలో మాట్లాడుతుంటారు. పార్టీకి నష్టం చేకూరుస్తారు. పార్టీ లైన్ తప్పుతుంటారు. పార్టీపై, అధినేత పై విపరీతమైన అభిమానంతో అడ్డగోలుగా చేసే వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తుంటాయి.మొన్నటికి మొన్న చిరంజీవిపై వైసీపీ శ్రేణులు చేసిన అతి అంతా ఇంతా కాదు.మూడు రాజధానులకు మద్దతుగా చిరంజీవి మాట్లాడేసరికి ఆయన గొప్పవాడు అయ్యాడు. అదే ప్రత్యర్థులకు మద్దతు ప్రకటించినప్పుడు, అందున సన్నిహితులకు ఆశీర్వదించినప్పుడు ఎంతో రగడ సృష్టించారు. చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటివారు యూటర్న్ తీసుకోక తప్పలేదు.
ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లు పడాలంటే వ్యూహాలు పన్నాలి. ప్రజలను ఆకట్టుకోవాలి. అంతేతప్ప ఈ కీలక సమయంలో వివాదాస్పద అంశాల జోలికి వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే అన్ని పార్టీల్లో అంకితభావం గల నాయకులు, కార్యకర్తలు వీలైనంతవరకు వివాదాస్పద అంశాల జోలికి పోరు. కానీ ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. పరస్పర హెచ్చరికలు, విమర్శలతో కొంతమంది వేడి పుట్టిస్తున్నారు. శాంతి వాతావరణానికి భగ్నం కలిగిస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో రాజకీయ పార్టీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించు కోకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అటు పార్టీలు సైతం అటువంటి వారిని ప్రోత్సహిస్తే లాభం కంటే నష్టం అధికం. మేల్కొనకుంటే ముప్పే.