AP Politics: వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నిష్క్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న వారు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో చాలామంది రాజకీయాలకు గుడ్ బై చెబుతుండడం విశేషం. ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచారు నాని. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో నిలబడిన ముగ్గురిలో ఆయన ఒకరు. 2024 ఎన్నికల్లో సైతం ఆయన తప్పకుండా ఎంపీ అయ్యేవారు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీ ఘోర పరాజయంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యారు. ఇలా ఫలితాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.వైసిపి నుంచి తొలి నిష్క్రమణ ఆయనదే.
* సినీ నటుడు అలీ సైతం
మరోవైపు సినీ నటుడు అలీ సైతం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు. ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు. ఆయన గత ఐదేళ్లుగా వైసిపి వేదికలను పంచుకున్నారు. ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. మరోసారి జగన్ గెలవాలని బలంగా ఆకాంక్షించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవులు దక్కుతాయని భావించారు. కానీ చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సర్దుకోవాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. వైసిపి ఓడిపోవడంతో తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని తేల్చేశారు.
* తొలుత పదవికి.. తరువాత పార్టీకి
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో ఓడిపోయారు. 2018లో గెలిచేసరికి జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టారు. అయితే ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. ఏలూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముందుగా వదులుకున్నారు. తరువాత వైసిపికి సైతం రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
* రాజకీయ ముని మౌనం
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా? లేదా? అన్నది అర్థం కావడం లేదు. ఈ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. 52 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ.. సీనియర్ నాయకుడిగా ఉన్న అంత తేడాతో ఓటమి చవిచూడడంతో ధర్మాన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరంగా గడపాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకొని.. కుమారుడికి మార్గదర్శకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
* ఏ పార్టీతో సంబంధం లేదట
తాజాగా పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అసలు తాను వైసీపీలో సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి పోసాని కృష్ణమురళి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. జగన్ కు మద్దతుగా.. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. వైసిపి హయాంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని చేపట్టారు. గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ముప్పేట కేసులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే రాజకీయ నిష్క్రమణ ప్రకటనలు భారీగా వెలువడుతుండడం విశేషం.